ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలు విడుదల
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బీచ్ షాక్స్’ పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవో నంబర్ - 362 ప్రకారం, ఎంపిక చేసిన బీచ్‌లలో పరిమిత నిబంధనలతో ఈ షాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గుర్తించిన ప్రదేశాల్లో అమలు చేయనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2029 ఆగస్టు 31వ తేదీ వరకు ఈ విధానం కింద బీచ్ షాక్స్ ఏర్పాటునకు నోటిఫికేషన్ జారీ చేసింది.
పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం.. నిబంధనలివే..
సూర్యలంక, విశాఖపట్నం బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏడాది తర్వాత పైలట్ దుకాణాలు తీరుపై రివ్యూ చేసి.. ఆ తర్వాతనే వాటి విస్తరణకు నిర్ణయం తీసుకోనున్నారు. మార్గదర్శకాల ప్రకారం బీచ్ షాక్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పనిచేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచించారు. పర్యాటకుల భద్రత, నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. అలాగే ఇక్కడ తక్కువ ఆల్కహాల్ కలిగిన పానీయాలు మాత్రమే సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. భారత తయారీ విదేశీ మద్యం (IMFL), ఫారిన్ లిక్కర్‌కు ఈ షాక్స్‌లో అనుమతి ఉండదని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
కోర్టు మార్గదర్శకాల ఆధారంగా విధానం..
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి హైవే ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై ఉన్న నిబంధనలను ఈ విధానానికి కూడా వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణం, పర్యాటక అభివృద్ధి, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
పర్యాటక అభివృద్ధి లక్ష్యం..
బీచ్ షాక్స్ ఏర్పాటు ద్వారా తీర ప్రాంత పర్యాటకానికి కొత్త ఆకర్షణ కల్పించడం, స్థానిక ఉపాధి అవకాశాలు పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఆధునిక సదుపాయాలతో ఈ షాక్స్ రూపకల్పన చేయనున్నారు.








Comments