ఔటర్‌పై ఘోరం
శంషాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది! ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం రెండు కుటుంబాలను చిదిమేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16వద్ద ఆగి ఉన్న లారీని.. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో సహా బయల్దేరి యాదగిరీశుడి దర్శనం చేసుకుని.. చిలుకూరు బాలాజీ దర్శనానికి ఆనందంగా తుళ్లుతూ వెళ్తున్న అన్నాచెల్లెళ్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఘటన ఇది. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, మొయినాబాద్ డీసీపీ యోగేశ్‌గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణానికి చెందిన శ్రీరామ బీడీ కంపెనీ యజమాని బొల్లి రాజు, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు బొల్లి శివకుమార్ (37), ఆయన భార్య రాజేశ్వరి అలియాస్ లాస్య (34), వారి కుమార్తె రిషిత (5).. శివకుమార్ సోదరి కోడం శ్వేత, ఆమె భర్త శ్రీనివాస్ (40), వారి కుమారులు కృష్ణ చంద్ర (13), మాధవ్ (10) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి శివకుమార్ సొంత కారు (వ్యాగనార్- టీఎస్ 23 ఎఫ్ 2298)లో బయల్దేరి యాదగిరిగుట్ట వెళ్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కణ్నుంచీ బయల్దేరి చిలుకూరు బాలాజీ ఆలయానికి బయల్దేరారు. అక్కడ దర్శనం అయ్యాక.. సాయంత్రం గచ్చిబౌలిలో షాపింగ్ చేసుకుని సనత్‌నగర్ వెళ్లాలన్నది వారి ప్రణాళిక. ఈమేరకు ఘట్కేసర్లో టోల్ 9 వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కారు.
సాయంత్రం 4 గంటల సమయంలో శంషాబాద్ ఎగ్జిట్ సమీపంలోకి రాగానే వారి కారు.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని (ఏపీ39యూవీ 0909) వేగంగా ఢీకొట్టింది. ఈ లారీ సూర్యాపేట నుంచి నంద్యాలకు బియ్యం లోడ్‌తో వెళుతోంది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు లారీని ఢీకొట్టి దాని కిందికి వెళ్లిపోయింది. కారులో ఉన్న శివకుమార్, లాస్య, రిషిత, శ్రీనివాస్, కృష్ణచంద్ర, మాధవ్ అక్కడికక్కడే చనిపోయారు. శ్వేతకు తీవ్ర గాలయయ్యాయి. వెనుక వచ్చిన వాహనదారులు ప్రమాదాన్ని గమనించి.. 100కు కాల్ చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుదేహలను కారులో నుంచి తీయడానికి గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు భారీ క్రేన్ సహాయంతో కారును వెనక్కి లాగి, మృతదేహాలను బయటకు తీశారు. గాయపడ్డ శ్వేతను తొలుత సమీపంలోని ట్రైడెంట్ ఆస్పత్రికి.. ఆ తర్వాత, మరింత మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శవ పంచనామా సమయం దాటిపోవడంతో మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. శనివారం ఉదయం 11 గంటలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాగా.. ప్రమాదం విషయం తెలుసుకున్న మొయినాబాద్ డీసీపీ యోగేశ్ గౌతమ్ ఘటనా స్థలాన్ని సందర్శించి స్థానిక సీఐ నరేందర్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కారు నడిపిన శివకుమార్ నిద్రమత్తులో ఉండడంఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని డీసీపీ పేర్కొన్నారు. అలాగే.. ఓఆర్ఆర్పై వాహనాలను ఆపడం నిషిద్ధం. అయినప్పటికీ లారీ డ్రైవర్ శ్రీనివాస్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని నిలిపారని పోలీసులు తెలిపారు. ఔటర్‌పై స్పీడ్లేన్లో 120 కి.మీ దాకా వేగంతో వాహనాలు వెళ్లొచ్చు. కానీ, ఈ ప్రమాద తీవ్రత చూస్తే కారు వేగం 120కి.మీ కంటే ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ కనీసం బ్రేక్ వేసిన ఆధారాలు కూడా కనిపించట్లేదు.









Comments