• May 02, 2026
  • NPN Log

    జైపూర్‌: గత మ్యాచ్‌లో చెత్త ఆటతీరు (16.3 ఓవర్లలో 75 ఆలౌట్‌)తో తీవ్ర విమర్శలపాలైన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి జూలు విదిల్చింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన పోరులో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75), నిస్సాంక (33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62), నితీశ్‌ రాణా (17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) బెంబేలెత్తించిన వేళ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. ఐపీఎల్‌ చరిత్రలో క్యాపిటల్స్‌కిది అత్యధిక ఛేదన కావడం విశేషం. తొలుత రాజస్థాన్‌ 20 ఓవర్లలో 225/6 స్కోరు చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 90), జురెల్‌ (30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42) సత్తా చాటారు. చివర్లో ఫెరీరా (14 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 47 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టాడు. రాహుల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

    ఓపెనర్ల సుడిగాలి ఇన్నింగ్స్‌: ఛేదనలో ఓపెనర్లు నిస్సాంక, కేఎల్‌ రాహుల్‌ తొలి బంతినుంచే రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా నిస్సాంక ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పవర్‌ ప్లేలో 70/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో నిస్సాంక హాఫ్‌ సెంచరీ పూరించాడు. నిస్సాంక జోరుకు 10వ ఓవర్లో జడేజా చెక్‌ పెట్టగా.. మొదటి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 11వ ఓవర్లో రాహుల్‌ సైతం అర్ధ శతకానికి చేరుకోగా.. కేఎల్‌కు జత కలిసిన నితీశ్‌ రాణా కూడా భారీషాట్లతో అలరించాడు. కానీ 15వ ఓవర్లో రాణా, 16 ఓవర్లో రాహుల్‌ నిష్క్రమించినా..ఢిల్లీ అప్పటికే విజయానికి చేరువైంది. ఇక, అశుతోష్‌ (25 నాటౌట్‌), స్టబ్స్‌ (18 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేశారు.

     

    జైస్వాల్‌, వైభవ్‌ విఫలం: ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ధనాధన్‌ ఆరంభాలిస్తున్న ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4) ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. వీరిద్దరిని కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళిక రచించిన ఢిల్లీ ఫలితం రాబట్టింది. అయితే కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌, జురెల్‌ జోడీ మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది. చివర్లో ఫెరీరా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజస్థాన్‌ స్కోరు 220 పరుగులు దాటింది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ స్టార్క్‌కు సిక్సర్‌తో జైస్వాల్‌ స్వాగతం పలికాడు. కానీ తదుపరి బంతిని తెలివిగా ఫుల్‌టాస్‌గా సంధించిన స్టార్క్‌.. జైస్వాల్‌ భారీ షాట్‌ కొట్టేలా ఊరించాడు. బంతి గాల్లోకి లేవగా స్టార్కే పరిగెత్తుకు వెళ్లి క్యాచ్‌ అందుకున్నాడు. ఇక..తన బౌలింగ్‌లో బౌండరీతో ఖాతా తెరిచిన వైభవ్‌ను వెంటనే ఓ యార్కర్‌తో జేమిసన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసి రాజస్థాన్‌కు షాకిచ్చాడు. తర్వాత జురెల్‌, పరాగ్‌ జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. కానీ ఆరో ఓవర్లో బ్యాటు ఝళిపించిన పరాగ్‌.. జేమిసన్‌ బౌలింగ్‌లో 6,4,6తో 20 పరుగులు రాబట్టాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసేసరికి రాజస్థాన్‌ 56/2తో నిలిచింది. మూడో వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న దశలో.. జురెల్‌ను క్యాచవుట్‌ చేసిన అక్షర్‌ ఢిల్లీకి ఊరటనిచ్చాడు. జెమిసన్‌ వేసిన 16వ ఓవర్లో పరాగ్‌ 4,4,4తో చెలరేగాడు. తర్వాతి ఓవర్లో జడేజా, పరాగ్‌ను మూడు బంతుల వ్యవధిలో స్టార్క్‌ పెవిలియన్‌ చేర్చి ప్రత్యర్థికి మరోసారి ఝలకిచ్చాడు. ఫెరీరా 18వ ఓవర్లో 20 పరుగులు, ఆపై స్టార్క్‌ బౌలింగ్‌లో 14 పరుగులు పిండుకోవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. చివరి ఓవర్లో శుభమ్‌ దూబే (6)ను నటరాజన్‌ వెనక్కి పంపినా.. మరోవైపు ఫెరీరా 18 పరుగులు కొల్లగొట్టాడు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement