ముగ్గురితో వివాహేతర సంబంధాలున్నాయి.. విచారణలో అంగీకరించిన బిల్గేట్స్..
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట వెల్లడించారు. తనకు మూడు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. అలాగే తన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి ఒత్తిడి తీసుకురావడానికి లేదా బ్లాక్మెయిల్ చేయడానికి జెఫ్రీ ఎప్స్టీన్ ప్రయత్నించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
అమెరికా ప్రతినిధుల సభ పర్యవేక్షణ కమిటీ నిర్వహించిన రహస్య విచారణలో బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తాజాగా విడుదలైన విచారణ పత్రాలు వెల్లడించాయి. మూడు వివాహేతర సంబంధాల్లో రెండింటి గురించి ఎప్స్టీన్కు సమాచారం ఉందని గేట్స్ చెప్పారు. అయితే తన అఫైర్లకు, ఎప్స్టీన్కు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎప్స్టీన్ తనను ఎప్పుడూ ప్రత్యక్షంగా బ్లాక్మెయిల్ చేయనప్పటికీ, అలా చేయాలని భావించి ఉండవచ్చని తాను నమ్ముతున్నట్లు గేట్స్ చట్టసభ సభ్యులకు తెలిపారు. 'ఎప్స్టీన్ నేరాలతో నాకెలాంటి సంబంధమూ లేదు. అతడితో సంబంధాలు కొనసాగించడం మాత్రం నా పొరపాటు. అవి నా కుటుంబాన్ని చాలా బాధించాయి' అని గేట్స్ పేర్కొన్నారు.
అలాగే తనకు లైంగిక వ్యాధులు ఉన్నాయని వచ్చిన వార్తలను గేట్స్ ఖండించారు. 'నాకు ఎప్పుడూ లైంగిక వ్యాధి రాలేదు. నాకు లైంగిక వ్యాధి ఉందేమోనని నేను కొంత ఆందోళన వ్యక్తం చేసి ఉండవచ్చు. అది నాకు గుర్తులేదు. కానీ నాకు ఎప్పుడూ లైంగిక వ్యాధి రాలేదు. నేను ఎవరికీ రహస్యంగా మందులు ఇవ్వలేదు' అని చట్టసభ సభ్యుల ఎదుట గేట్స్ స్పష్టం చేశారు.










Comments