రూ.200 చిల్లర విషయంలో వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య..
హైదరాబాద్ : నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.200 చిల్లర విషయంలో తలెత్తిన వివాదం.. ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలను బలిగొంది. మొహమ్మద్ ముక్రం అనే ఆటో డ్రైవర్‌పై అజీమ్, షోయబ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వట్టేపల్లిలోని నైస్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ముక్రంను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిలో అజీమ్ అనే వ్యక్తి యూట్యూబర్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. రూ.200 చిల్లర విషయంలో ప్రారంభమైన వివాదం చివరకు దాడి, హత్యకు దారితీయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు ఎంతమంది ఉన్నారు, దాడికి ఖచ్చితమైన కారణాలు ఏమిటనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.









Comments