• Sep 20, 2026
  • NPN Log

    నాటి మేటి నటులు నటరత్న యన్టీఆర్ - నటసమ్రాట్ ఏయన్నార్ ఇద్దరికీ హిట్ పెయిర్‌గా అలరించిన జమున.. తరువాతి రోజుల్లో హరనాథ్‌తోనూ సక్సెస్ రూటులో సాగారు. యన్టీఆర్ ‘సీతారామకళ్యాణం’లో శ్రీరామునిగా నటించిన హరనాథ్‌  కు ‘యన్టీఆర్ మెచ్చిన రాముడు’ అనే పేరుండేది. ఎందుకంటే, తెలుగువారికి శ్రీరాముడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే నటుడు యన్టీఆరే. అలాగే యన్టీఆర్ తరువాత అంతటి అందగాడు అనే పేరు కూడా సంపాదించారు హరనాథ్. అలాంటి హరనాథ్‌తో జమున జోడీ కట్టిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో మిన్నగా ఆకట్టుకున్న సినిమా ‘లేతమనసులు’. ఏవీయమ్ సంస్థ తమిళంలో నిర్మించిన ‘కుళందైయుమ్ దైవముమ్’ సినిమా ఆధారంగా ‘లేతమనసులు’ తెరకెక్కింది.

    అసలు ‘కుళందైయుమ్ దైవముమ్’ చిత్రానికి ‘ద పేరెంట్ ట్రాప్’ అనే హాలీవుడ్ మూవీ ఆధారం. జర్మన్ రచయిత ఎరిక్ కాస్ట్నర్ రాసిన ‘లిసా అండ్ లోట్టి’ అనే నవలతో ‘ద పేరెంట్ ట్రాప్’ తెరకెక్కింది. ‘కుళందైయుమ్ దైవముమ్’ లోనూ జమున నాయికగా నటించారు. అందులో ఆమె కూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేసిన కుట్టి పద్మిని తెలుగులోనూ తన పాత్రలోనే కనిపించారు. తమిళ చిత్రాన్ని రూపొందించిన దర్శకద్వయం కృష్ణన్-పంజు ‘లేతమనసులు’నూ తెరకెక్కించారు. 1966 సెప్టెంబర్ 16వ తేదీన విడుదలైన ‘లేతమనసులు’ ఆ యేడాది టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలచింది.

    ‘లేతమనసులు’ కథ విషయానికి వస్తే.. కలవారి అమ్మాయి సత్యభామ, సామాన్యుడైన శేఖర్ ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. వారికి కవల పిల్లలు పుడతారు. సత్యభామ తల్లి కారణంగా శేఖర్ భార్య నుంచి విడిపోతాడు. తనతో పాటు ఓ కూతురును తీసుకువెళతాడు. తరువాత శేఖర్ దగ్గర పెరిగే అమ్మాయి, సత్యభామ వద్ద ఉండే కూతురు ఇద్దరూ ఒకే స్కూల్‌లో కలుసుకోవడం.. వారికి తాము కవల పిల్లలమన్న నిజం తెలియడం జరుగుతాయి. తరువాత పప్పీ, లల్లీ ఇద్దరూ తమ కన్నవారిని కలపడమే కథ. ఈ కథ స్ఫూర్తితో తరువాత ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇదే కథతో హిందీలో ‘దో కలియా’, మళయాళంలో ‘సేతుబంధనం’, కన్నడలో ‘మక్కల భాగ్య’ రూపొందాయి. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలకు కృష్ణన్-పంజు దర్శకత్వం వహించారు. ఈ మూడు సినిమాలను ఏవీయమ్ సంస్థ నిర్మించింది. హిందీలో ఈ నాటి మేటి హీరో రణబీర్ కపూర్ తల్లి నీతూసింగ్ బాలనటిగా ద్విపాత్రాభినయం చేశారు.

    ‘లేతమనసులు’ చిత్రానికి తెలుగులో డి.వి. నరసరాజు రచన చేశారు. పాటలను ఆరుద్ర, దాశరథి రాశారు. యమ్మెస్ విశ్వనాథన్ స్వరకల్పనలో రూపొందిన పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఈ చిత్రంలో రేలంగి, పద్మనాభం, జి.వరలక్ష్మి, జగ్గారావు, గీతాంజలి, మణిమాల ఇతర ముఖ్యపాత్రధారులు. ఆ నాటి టాప్ స్టార్స్ మూవీస్ సక్సెస్ రూటులో సాగుతూ పోటీగా ఉన్నా, ‘లేతమనసులు’లోని చైల్డ్ సెంటిమెంట్ ఈ సినిమాకు ఘనవిజయం దక్కేలా చేసింది. రిపీట్ రన్స్‌లోనూ ‘లేతమనసులు’ విశేషంగా ఆకట్టుకుంది. ఈ నాటికీ ‘లేతమనసులు’ అడపాదడపా బుల్లితెరపై ప్రత్యక్షమవుతూనే ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement