• Jun 25, 2026
  • NPN Log

    దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నెల 10, 11 తేదీల్లో చేపట్టిన మూడు అత్యంత ప్రాధాన్యమైన క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో దేశ రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్(బీఎండీ) వ్యవస్థ, యాంటీ-షిప్ వార్‌ఫేర్ సామర్థ్యాలు, సుదూర లక్ష్యాలను నిర్వీర్యం చేయడంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది భారత్. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఇంటర్‌సెప్టర్ క్షిపణులు సుదూరం నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించాయి. దీంతో అత్యాధునిక బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించగల దేశాల సరసన నిలిచింది భారత్. దేశ భద్రతకు సవాలుగా మారే సుదూర క్షిపణి ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం భారత రక్షణ వ్యవస్థకూ ఉందని దీంతో స్పష్టమైంది. ఇక.. యాంటీ-షిప్ యుద్ధ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన నావల్ యాంటీ షిప్ మిసైల్-మీడియం రేంజ్  తొలి ప్రయోగ పరీక్ష కూడా విజయవంతమైంది. సముద్రంలో శత్రు యుద్ధనౌకలను కచ్చిత లక్ష్యంగా దాడిచేసే సామర్థ్యాన్ని ఈ క్షిపణి ప్రదర్శించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ దేశ నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయనుంది.

    మూడు కీలక పరీక్షలు వరుసగా విజయవంతం కావడం డీఆర్‌డీఓ సైంటిస్ట్‌ల ప్రతిభకు నిదర్శనమని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మరింత పురోగతి సాధించే దిశగా భారత్ దూసుకెళ్తోందని వెల్లడించాయి. ఈ విజయాలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భారత సాయుధ దళాలు, ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములైన వారందరినీ ఆయన అభినందించారు. దేశ భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా ఈ విజయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement