శుక్రవారం మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం
హైదరాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అధికారులు సోమవారం భారీ గణపతి నిమజ్జన ట్రయల్స్ నిర్వహించారు. ఏసీపీతో పాటు ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో కలసి గణపతి పొడవు, వెడల్పులను బేరీజు వేసుకుంటూ నిమజ్జనానికి వచ్చే ఆటంకాలను గుర్తించారు. కొన్ని చెట్లు, విద్యుత్ వైర్లు, కటౌట్లు, కేబుల్ వైర్లు, విద్యుత్ సంస్థకు చెందిన కొన్ని లైట్లు అడ్డొస్తున్నాయని గుర్తించి 24లోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మధ్యాహ్నం 12 లోపే..
శుక్రవారం మధ్యాహ్నం 12 లోపే భారీ గణనాథుడి నిమజ్జన తంతు ముగించాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకే దర్శనాలకు అనుమతిస్తామని, గురువారం ఉదయం నుండి భక్తులు దర్శనాలకు రావద్దని పోలీసులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభించి 12 గంటల లోపు ఎన్టీఆర్ మార్గంలోని క్రేన్ నెంబరు 5 వద్ద భారీ గణపతిని నిమజ్జనం చేస్తామని ఖైరతాబాద్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. కాగా, మహాగణపతిని సోమవారం విద్యుత్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్తో పాటు పలువురు ప్రముఖులు దర్శించారు.









Comments