• Sep 22, 2026
  • NPN Log

    పశ్చిమ బెంగాల్‌: నాలుగు రోజుల వయసున్న ఏనుగు పిల్లను పశ్చిమ బెంగాల్‌ అటవీశాఖ అధికారులు, స్థానిక మత్స్యకారులు సాహసోపేతంగా రక్షించారు. తీస్తా నది లో ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆ గున్న ఏనుగును రక్షించి దానిని తల్లి ఏనుగుతో విజయవంతంగా కలిపారు. ఈ ఘటన జలపాయిగురి జిల్లా మాల్బజార్‌ బ్లాక్‌ పరిధిలోని బైకుంఠపూర్‌ అటవీ డివిజన్‌లో చోటుచేసుకుంది.

    అటవీశాఖ అధికారుల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఓ ఏనుగుల గుంపు తీస్తా నదిని దాటేందుకు ప్రయత్నించింది. అయితే, సుమారు నాలుగు రోజుల వయసున్న ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తూ తల్లి నుంచి విడిపోయింది. బలమైన నీటి ప్రవాహానికి గజల్డోబా బ్యారేజీకి దిగువకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర కొట్టుకుపోయింది. అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న స్థానిక మత్స్యకారులు గున్న ఏనుగును గుర్తించారు. వెంటనే చిన్న పడవతో దానిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీటిలో మునిగిపోతున్న ఏనుగు పిల్లను తీవ్రంగా శ్రమించి పడవలోకి ఎక్కించారు. అనంతరం సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.

    అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఏనుగు పిల్లను పరిశీలించారు. దానికి ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారించారు. అనంతరం ఆలస్యం చేయకుండా గున్న ఏనుగును తల్లి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే పిల్ల కోసం తల్లి ఏనుగు గాలిస్తోంది. దీంతో దాని సమీపంలో గున్న ఏనుగును విడిచిపెట్టారు. చివరకు తన పిల్లను గుర్తించిన తల్లి దగ్గరకు తీసుకుంది. దానికి పాలు ఇచ్చి తిరిగి తమ గుంపులోకి చేర్చుకుంది. దీంతో అటవీశాఖ అధికారులు, స్థానిక మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement