• Sep 20, 2026
  • NPN Log

    వినాయకుడిని గణపతి, గణనాథుడు, గణాధిపతి వంటి పేర్లతో భక్తులు పిలుస్తుంటారు. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సకల గణాలకు అధిపతిగా వినాయకుడు ఎలా నియమితులయ్యాడు? దీని వెనుక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది.

    పురాణ కథనం ప్రకారం.. ముల్లోకాల్లోని విఘ్నాలను తొలగించే బాధ్యతను ఎవరికైనా అప్పగించాలని దేవతలు, మునులు శివుడిని కోరారు. దీంతో శివుడు తన కుమారులైన గణపతి, కుమారస్వామి ఇద్దరిలో ఒకరిని గణాధిపతిగా ఎంపిక చేయాలని నిర్ణయించాడు. ఇద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. ముల్లోకాల్లో ఉన్న పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి, ముందుగా కైలాసానికి తిరిగి వచ్చినవారికి గణాధిపత్యం ఇస్తానని ప్రకటించాడు. ఈ మాట వినగానే కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు.

    గణపతి వాహనం మూషికం కావడంతో కుమారస్వామితో పోటీగా వెళ్లడం సాధ్యం కాదని భావించాడు. అప్పుడు ఒక ఉపాయం ఆలోచించాడు. నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. తల్లిదండ్రులే సమస్త లోకాలకు ప్రతిరూపమనే భావనతో వారిని ప్రదక్షిణ చేయడం ద్వారా ముల్లోకాలను చుట్టివచ్చినట్లేనని పురాణ కథనం చెబుతోంది.

    అంతలో కుమారస్వామి పవిత్ర నదుల్లో స్నానం చేసి కైలాసానికి చేరుకునేలోపే గణపతి శివుడి వద్దకు వచ్చాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుమారస్వామి గణపతి గొప్పతనాన్ని అంగీకరించాడు. దీంతో శివుడు గణపతిని గణాధిపతిగా నియమించినట్లు పురాణ కథనం చెబుతోంది. అప్పటి నుంచి వినాయకుడు గణపతి, గణనాథుడు, గణాధిపతి పేర్లతో ప్రసిద్ధి చెందాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement