• Sep 20, 2026
  • NPN Log

    వ్యాయామంలో స్క్వాట్స్‌ను చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఇవి కాళ్ల కండరాలు బలపరచడంతో పాటు శరీర సమతుల్యతను మెరుగుపరుస్తాయి. తోడ, తుంటి కండరాలను బలోపేతం చేయడంలోనూ స్క్వాట్స్ సహాయపడతాయి. వీటిని తరచూ చేయడం వల్ల కొవ్వు కూడా తగ్గుతుంది. అయితే చాలా మంది స్క్వాట్స్‌లో కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి వారు ఆశించిన మేర ఫలితాలు పొందలేరు. స్క్వాట్స్ ద్వారా అధిక ప్రయోజనాలు కావాలనుకుంటే ఈ కింది తప్పులను చేయకండి. 

    1. మరీ ఎక్కువ బరువులను ఎత్తవద్దు: స్క్వాట్స్ చేస్తున్న సమయంలో ఎక్కువ బరువులను ఎత్తకండి. అధిక బరువు కారణంగా మోకాళ్లపై భారం పడుతుంది. అలాగే బరువు కారణంగా సరైన భంగిమను కొనసాగించడమూ కష్టమవుతుంది. అందుకే మొదట నియంత్రించగలిగే బరువుతోనే వ్యాయామం ప్రారంభించాలి. ఆ తరువాత క్రమంగా బరువును పెంచాలి.

    2. నీ-వాల్గస్‌ను నివారించండి: కొందరు వ్యాయామ సమయంలో మోకాళ్లను వంచినప్పుడు ఒకదానికొకటి తగులుతుంది. దీన్నే నీ-వాల్గస్ అని వ్యవహరిస్తారు. ఇలా మోకాళ్లను వంచడం వల్ల వ్యాయామ ప్రయోజనాలు తగ్గిపోతాయి. తొడలు, తుంటి భాగాలు బలహీనంగా ఉండడం వల్ల నీ-వాల్గస్ వస్తుంది. దీన్ని అధిగమించాలంటే కాలి వేళ్లు ఉన్న దిశలోనే మోకాళ్లను కదిలించాల్సి ఉంటుంది.

    3. మడమలను పైకి ఎత్తడం: స్క్వాట్స్ చేస్తున్నప్పుడు మడమలను నిలకడగా ఉంచాలి. వాటిని పైకి ఎత్తితే.. శరీరంలో బ్యాలెన్స్ కోల్పోతుంది. చీలమండ కదలికలు పరిమితంగా ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. దీన్ని నివారించడానికి మడమలను నేలపై గట్టిగా ఆనించి ఉంచాలి. అలాగే బరువును వేళ్లపై సమానంగా ఉండేలా చూసుకోవాలి.

    4. నడుమును అధికంగా వంచడం: వ్యాయామ సమయంలో నడుము భాగాన్ని అధికంగా వంచడాన్ని ‘బట్ వింక్’ అని పిలుస్తారు. ఇలా అతిగా వంచితే బరువు మోస్తున్నప్పుడు భంగిమను కొనసాగించలేం. శరీరంపై నియంత్రణ లేనప్పుడు, ఎక్కువ బరువు మోస్తున్నప్పుడు ‘బట్ వింక్’ సమస్య వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే వ్యాయామంలో వెన్నెముకను నిటారుగా ఉంచాలి. శరీర సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్క్వాట్స్ చేయాలి.

    5. ఒకేసారి కిందకు రావడం: స్క్వాట్స్ భంగిమలో కొందరు వేగంగా, ఒకేసారి కిందకు రావడం, ఒకేసారి పైకి వెళ్లడం చేస్తుంటారు. ఇలా చేస్తే కండరాలపై ఒత్తిడి పడుతుంది. అవి శరీర కదలికలను అర్థం చేసుకోలేవు. అందుకే స్థిరమైన వేగంతో కిందకి రావాలి. అలానే నియంత్రణతో పైకి లేవాలి.

    6. షాల్లో స్క్వాట్స్‌కే పరిమితం కావద్దు: మోకాళ్లను పూర్తిగా కిందకు దించకుండా చేసే స్క్వాట్స్‌ను షాల్లో స్క్వాట్స్ అంటారు. వీటి వల్ల ప్రయోజనాలున్నప్పటికీ కండరాల అభివృద్ధికి ఇవి అంతగా దోహదపడవు. అందుకే పూర్తి స్క్వా్ట్స్ చేయడమే మంచిది.

    7. వార్మ్-అప్, రికవరీలను నిర్లక్ష్యం చేయొద్దు: వ్యాయామంలో వార్మ్-అప్, రికవరీలు ముఖ్యమైనవని గుర్తించాలి. కోల్డ్ మసిల్స్‌ను స్క్వాట్స్ కోసం సిద్ధం చేయడంలో సరైన వార్మ్-అప్ ఉపయోగపడుతుంది. దీని వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వ్యాయామం తరువాత అలిసిపోయిన కండరాలకు రికవరీ అవసరం. లేదంటే ఆ కండరాలు బలహీనమవుతాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement