• Sep 20, 2026
  • NPN Log

    నంద్యాల : స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు, ఏపీకే ఫైల్స్‌ పేరిట మోసాలకు పాల్పడిన ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.25 లక్షల నగదుతో పాటు నాలుగు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల ఎస్పీ సునీల్‌ షొరాన్‌ గురువారం మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా ధర్మపురికి చెందిన కొలుసు శ్రీకాంత్‌, విజయవాడకు చెందిన సనపాల సాయి ప్రకాశ్‌ నాయుడు... 2024 డిసెంబరులో నంద్యాల జిల్లా సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మల్లికార్జునకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమయ్యారు. స్టాక్‌ మార్కెట్‌లో అధిక రాబడి పేరిట ఆశలు కల్పించి రూ.22.80 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం ఓ నకిలీ యాప్‌లో ఆ పెట్టుబడికి లాభం కింద తన ఖాతాలో 1.44కోట్లు ఉన్నట్లు చూపించారు.

    ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే ట్యాక్స్‌, చార్జీల రూపంలో రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్‌, సాయి ప్రకాశ్‌నాయుడు.. 2025 డిసెంబరులో రేవనూరుకు చెందిన ఆటోడ్రైవర్‌ చరణ్‌రాజ్‌కు చెందిన ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో 5.24 లక్షలు ఉన్నట్లు గుర్తించి తన సెల్‌ఫోన్‌కు ఏపీకే ఫైల్‌ పంపించారు. ఆ ఫైల్‌ను చరణ్‌ రాజ్‌ ఓపెన్‌ చేయగా.. క్షణాల్లో ఖాతాలోని మొత్తం నగదును సైబర్‌ నేరగాళ్లు లూటీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసులపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వారిపై నిఘా పెట్టారు. శ్రీకాంత్‌, ప్రకాశ్‌నాయుడు కోవెలకుంట్ల సమీపంలో ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement