సూర్యరశ్మి, వర్షం లేకుండానే పంటలు.. మూతపడిన బొగ్గు గనుల్లో చైనా కొత్త ప్రయోగం..
వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో చైనా శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగం చేశారు. మూతపడిన బొగ్గు గనులను భూగర్భ వ్యవసాయ క్షేత్రాలుగా మార్చి పంటలు పండించే విధానంపై పరిశోధనలు చేశారు. ఇక్కడ సూర్యరశ్మి, వర్షం లేకపోయినా కృత్రిమ వెలుతురు, నియంత్రిత ఉష్ణోగ్రత, శుద్ధి చేసిన నీటితో సాగు చేయవచ్చని చెబుతున్నారు.
చైనాలో 2030 నాటికి సుమారు 15,000 పాత బొగ్గు గనులు మూతపడే అవకాశం ఉందని అంచనా. ఈ గనుల్లోని సొరంగాలు, విద్యుత్ గ్రిడ్లు, వెంటిలేషన్ వ్యవస్థలు, భూగర్భ జలాలను వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. దీంతో కొత్తగా భారీ స్థాయిలో భూమిని సిద్ధం చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. భూగర్భ గనుల్లో సహజంగా సూర్యరశ్మి ఉండదు. అందుకే పంటలకు అవసరమైన ఎండను కృత్రిమంగా అందించనున్నారు.
భూగర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బయట వాతావరణంతో పోలిస్తే ఎక్కువ స్థిరంగా ఉంటాయి. అవసరమైన వేడిని అందించేందుకు జియోథర్మల్ ఎనర్జీ వంటి మార్గాలను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే బయట తీవ్రమైన ఎండ, చలి లేదా వర్షాలు ఉన్నా.. గనుల లోపల పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. బొగ్గు గనుల్లో లభించే భూగర్భ జలాల్లో కాలుష్య పదార్థాలు, భారీ లోహాలు ఉండే అవకాశం ఉంది. మెంబ్రేన్ సెపరేషన్ వంటి సాంకేతికతతో ఆ నీటిని శుద్ధి చేసి సాగుకు వినియోగించాలని శాస్త్రవేత్తలు సూచించారు.
ఈ పరిశోధన భవిష్యత్ స్పేస్ మిషన్లకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమికి భిన్నమైన పరిస్థితులు ఉండే ఇతర గ్రహాలు లేదా అంతరిక్ష కేంద్రాల్లో మనుషులకు అవసరమైన ఆహారాన్ని ఎలా పండించాలి? పరిమితమైన నీరు, వెలుతురు, శక్తి వనరులతో మొక్కలను ఎలా పెంచాలి? వంటి అంశాలపై ఈ ప్రయోగాల ద్వారా కీలక సమాచారం లభించే అవకాశం ఉంది.










Comments