20 కేజీల గంజాయి అక్రమ తరలింపు.. నలుగురి అరెస్ట్
తిరుపతి : తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడింది. కృష్ణా జిల్లా నుంచి నగరి నియోజకవర్గంలోని ఓజికుప్పంకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో వడమాలపేట పోలీసులు తనిఖీలు నిర్వహించి దాదాపు 20 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణారావు, భవాని.. నగరిలోని ఓజికుప్పం ప్రాంతానికి చెందిన శాంసన్, ఊర్విల్ ఉన్నారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవలి కాలంలో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తరచుగా గంజాయి పట్టుబడటం కలకలం రేపుతోంది. మదనపల్లి ప్రాంతంలో 179 కేజీలు పట్టుబడగా.. మరికొన్ని ప్రాంతాల్లో చిన్న, పెద్ద మొత్తాల్లో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.









Comments