• Sep 20, 2026
  • NPN Log

    మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతోన్న వేళ.. సైకియా స్పందించారు. ఇతర క్రికెట్ బోర్డు ప్రతినిధులను కలవడం, వారితో మాట్లాడటం అత్యంత సర్వసాధారణమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యేక అర్థాలు ఆపాంచికోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

    ‘మేము ఎవరినీ కలవకుండా ఉండలేం కదా. టాస్ నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు నేను రాయల్‌ బాక్స్‌లోనే కూర్చున్నా. మ్యాచ్‌ సమయంలో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నన్ను కలిశారు. కొందరు నా పక్కన కూర్చున్నారు. శుక్లా వచ్చి నాతో కూర్చున్నారు. మీరు ప్రస్తావించిన వ్యక్తి (నఖ్వీ) కూడా డిప్యూటీ ఛైర్మన్‌ ఖాలిద్‌ అల్‌ జరోనీ సాహెబ్‌తో కలిసి నా పక్కన వచ్చి కూర్చున్నారు. నఖ్వీతో మాట్లాడిన దానికి ప్రత్యేక అర్థాలు ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇతర క్రికెట్‌ బోర్డుల అధికారులను కలవడం సాధారణ ప్రక్రియే’ అని సైకియా పేర్కొన్నారు.

    మా ప్రయత్నాలు ఫలించలేదు..

    మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత తలెత్తిన ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రయత్నించిందని కూడా సైకియా వెల్లడించారు. ట్రోఫీ విషయంలో ఏర్పడిన గందరగోళంపై బీసీసీఐ తరఫున ఏసీసీకి ఒక పరిష్కార మార్గాన్ని సూచించామని.. అయితే దానికి అంగీకారం లభించలేదని చెప్పారు. ‘ట్రోఫీ విషయంలో ఏసీసీతో చర్చలు జరిపాం. మా ప్రయత్నాలు సఫలం అవ్వలేదు. అందుకు మాకు ఎలాంటి బాధ కూడా లేదు. ట్రోఫీ ఎవరు అందజేస్తారనే దానిపై దృష్టి పెట్టడం మా అంతిమ లక్ష్యం కాదు. భారత జట్టు విజయం సాధించాలన్నదే మా ప్రధాన ఆశయం. అది సాధించాం’ అని సైకియా వివరించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement