అభిషేక్ విధ్వంసం
న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108) మరోసారి విజృంభించాడు. గురువారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 30 బంతుల్లోనే రికార్డు శతకం బాదేశాడు. అతడి ధాటికి సంజూ శాంసన్ (35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) నిలకడ తోడయ్యింది. అనంతరం భారత బౌలర్ల విజృంభణకు అఫ్ఘాన్ బ్యాటర్లంతా కలిసి అభిషేక్ స్కోరును కూడా అందుకోలేకపోయారు. దీంతో భారత్ 127 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే 3-0తో ఈ సిరీ్‌సను సైతం క్లీన్‌స్వీప్ చేసింది. ముుందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 221 పరుగులు చేసింది. శ్రేయాస్ (29) ఫర్వాలేదనిపించాడు. ఒమర్జాయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో అఫ్ఘాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. జద్రాన్ (25) టాప్ స్కోరర్. నితీశ్, బిష్ణోయ్‌లకు మూడేసి.. అక్షర్‌కు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అభిషేక్‌కు దక్కింది.
పేకమేడలా..: భారీ ఛేదనలో అఫ్ఘాన్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి కనీసం వంద పరుగులైనా చేయలేక చతికిలపడింది. నాలుగో ఓవర్‌లోనే గుర్బాజ్‌ను స్పిన్నర్ అక్షర్ అవుట్ చేయడంతో తడబాటు ఆరంభమైంది. పవర్‌ప్లేలో జట్టు 51 పరుగులు చేసినప్పటికీ 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. నితీశ్ 12వ ఓవర్‌లో ఏకంగా నబీ (8), ఒమర్జాయ్ (17), ముజీబుర్ (0)లను పెవిలియన్‌కు చేర్చగా అఫ్ఘాన్ 82/8 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. చివరకు మరో 35 బంతులుండగానే భారత్ మ్యాచ్‌ను ముగించింది.
ఎడా పెడా: టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ రఫ్ఫాడించాడు. రెండో ఓవర్‌లో 6,4,6తో మొదలెట్టిన అభిషేక్ మూడో ఓవర్‌లో 23 పరుగులు చేశాడు. ఇక నబీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లోనైతే 29 రన్స్ సమకూరాయి. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 100 పరుగులతో నిలిచింది. అభిషేక్ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి 30 బంతుల్లోనే శతకం బాదేశాడు. అయితే కాసేపటికే స్పిన్నర్ రషీద్ అతడి విధ్వంసానికి బ్రేక్ వేయడంతో తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అఫ్ఘాన్ బౌలర్లు పట్టు సాధించడంతో భారత్ వికెట్లను వేగంగానే కోల్పోయింది. తిలక్ (2) రనౌట్ కాగా.. శాంసన్‌ను ఒమర్జాయ్ అవుట్ చేశాడు. చివరి ఐదు ఓవర్లలో 37 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది.










Comments