ఆకలిగా ఉన్నప్పుడు కడుపులో పేగులు ఎందుకు అరుస్తాయో తెలుసా?
ఆకలిగా ఉన్నప్పుడు కడుపులో పేగులు అరవడం చాలామందికి సాధారణమే. ఏమీ తినకుండా ఉండటం వల్లే ఈ శబ్దాలు వస్తున్నాయని అనుకుంటారు. అయితే ఇందులో ఆకలి ఒక కారణం మాత్రమే. వాస్తవానికి జీర్ణవ్యవస్థలో జరిగే సహజ కదలికల వల్ల కూడా ఇలాంటి శబ్దాలు వస్తుంటాయి. మనం ఆహారం తీసుకోని సమయంలో కూడా కడుపు, పేగులు తమ పనిని ఆపవు. పేగులు సంకోచించడం, వాటిలోని గాలి, ద్రవాలు ముందుకు కదలడం వంటి ప్రక్రియల సమయంలో శబ్దాలు ఏర్పడతాయి. వైద్య పరిభాషలో వీటిని బోర్బోరిగ్మి అంటారు. అయితే ఆకలిగా ఉన్నప్పుడు ఈ శబ్దాలు ఎందుకు ఎక్కువగా వినిపిస్తాయి? ఎప్పుడు వైద్యులని సంప్రదించాలి? తెలుసుకుందాం..
ఆకలిగా ఉన్నప్పుడు పేగులు ఎందుకు అరుస్తాయి?
జీర్ణవ్యవస్థ భోజనం చేసిన తర్వాత మాత్రమే పనిచేస్తుందని అనుకోవడం పొరపాటు. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు, భోజనాల మధ్యలోనూ కడుపు, పేగుల్లో కదలికలు కొనసాగుతూనే ఉంటాయి. కడుపు ఖాళీగా ఉన్న సమయంలో జీర్ణవ్యవస్థలో ఒక ప్రత్యేకమైన కదలికల విధానం కొనసాగుతుంది. దీనినే మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ అంటారు. ఇది కడుపు, పేగుల్లోని మిగిలిన పదార్థాలు, ద్రవాలు, వాయువులను ముందుకు కదిలించడంలో భాగంగా పనిచేస్తుంది. కడుపులో ఆహారం తక్కువగా ఉన్నప్పుడు ఈ కదలికల వల్ల ఏర్పడే శబ్దాలు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే ఎక్కువసేపు తినకుండా ఉన్నప్పుడు కడుపు నుంచి వచ్చే గడగడ శబ్దం బిగ్గరగా అనిపించవచ్చు.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
కడుపులో శబ్దాలతో పాటు కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే వైద్యులని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా:
కడుపునొప్పి
వికారం
వాంతులు
మలబద్ధకం
విరేచనాలు
కారణం తెలియకుండా బరువు తగ్గడం
జ్వరం
హిమోగ్లోబిన్ తగ్గడం
కడుపులో శబ్దాలు చాలాకాలం పాటు కొనసాగుతూ, పై లక్షణాల్లో ఏవైనా తోడైతే దాన్ని కేవలం ఆకలిగా భావించి వదిలేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఇవి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు సంకేతం కావచ్చు.










Comments