ఆటను, అనారోగ్యాన్ని జయించి..
మూడ్రోజుల క్రితం న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-3, 7-6(7-2), 5-7, 6-2తో 8వ సీడ్ బెన్ షెల్ట న్(అమెరికా)ను ఓడించి కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ట్రోఫీ అందుకునే సమయంలో కెరీర్‌లో ఎదురైన కష్టాలు, తల్లి ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమైన జ్వెరెవ్.. అనారోగ్యాన్ని తట్టుకొని చాంపియన్‌గా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.
ఓవైపు ప్రత్యర్థితో.. మరోవైపు శరీరంతో
జ్వెరెవ్ ఎప్పుడు కోర్టులో అడుగుపెట్టినా ఇద్దరితో పోరాటం చేయాల్సి వచ్చేది. ఒకటి తన ప్రత్యర్థితో.. మరొకటి తన శరీరంతో. ఎందుకంటే నాలుగేళ్ల వయసులోనే అతడు టైప్-1 డయాబెటిస్ బారిన పడ్డాడు. జ్వెరెవ్ ఆటలకు వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు తెలిపారు. కానీ, అతడి అమ్మ ఇరినా మాత్రం వెనకడుగు వేయకుండా కొడుకును టెన్నిస్ వైపు ప్రోత్సహించింది. గంటల తరబడి సుదీర్ఘ ర్యాలీలతో సాగే టెన్ని్‌సలో సాధారణంగానే ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోతారు. అలాంటిది, మధుమేహ బాధితుడైన జ్వెరెవ్ పరిస్థితి మరింత బాధాకరం. నిరంతరం అతడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందే. ఆట మధ్యలో షుగర్ లెవెల్స్ పడిపోకుండా జాగ్రత్త పడాల్సిందే. లేదంటే మ్యాచ్ మధ్యలోనే ఇంటికెళ్లాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు మ్యాచ్‌ల సమయాల్లో తన గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తూనే, అవసరమైనప్పుడు ఇన్సులిన్ తీసుకునేవాడు. ఇలాంటి కఠిన సవాళ్లను దాటుకొని ఆటలో ముందుకెళ్లాడు. ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, అత్యున్నత ఆటతో అదరగొడుతూ, ఇవాళ విజేతగా నిలిచాడు. మూడునెలల క్రితం ఫ్రెంచ్ ఓపెన్, ఇప్పుడు యూఎస్ ఓపెన్‌తో 2గ్రాండ్‌స్లామ్స్‌ను దక్కించుకున్నాడు. రెండో ర్యాంక్‌తో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఫౌండేషన్‌తో ఆపన్నహస్తం..
తాను మధుమేహ బాధితుడినన్న విషయాన్ని చాన్నాళ్లపాటు గోప్యంగానే ఉంచిన జ్వెరెవ్.. తన సమస్య గురించి నాలుగేళ్ల క్రితం బహిరంగంగా వెల్లడించాడు. తనలాంటి వాళ్లు చాలామంది ఉన్నారని భావించి ‘అలెగ్జాండర్ జ్వెరెవ్’ పేరిట ఓ ఫౌండేషన్‌ను స్థాపించాడు. మధుమేహంతో ఉన్న పిల్లలకు తన ఫౌండేషన్ తరఫున ఇన్సులిన్, మెడికేషన్ అందిస్తున్నాడు.










Comments