• Sep 20, 2026
  • NPN Log

    పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, జైలు పరిస్థితులపై కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని తమ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇమ్రాన్‌కు మెరుగైన వైద్యం, న్యాయపరంగా సహాయం అందేలా పాకిస్థాన్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆసీస్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు రాసిన ఈ లేఖపై అలెన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూస్, మార్క్ టేలర్, స్టీవ్ వా సంతకాలు చేశారు.

    ‘ఇమ్రాన్‌పై ఉన్న కేసులు, ఆయనకు విధించిన శిక్ష లేదా పాకిస్థాన్‌ రాజకీయ వ్యవహారాలపై గురించి మాకు సంబంధం లేదు. అవన్నీ పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాలు. కానీ జైలులో ఒక ఖైదీకి అందాల్సిన కనీస మానవతా ప్రమాణాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు పరిస్థితులపై వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయన విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక వన్డే ప్రపంచకప్‌ను ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోనే ఆ దేశం గెలుచుకుంది. అనంతరం పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. క్రికెటర్‌గా, నాయకుడిగా ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆస్ట్రేలియాలో ఎంతో గౌరవం ఉంది’ అని ఏడుగురు ఆసీస్ మాజీ కెప్టెన్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

    అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు: గ్రెగ్ చాపెల్

    గ్రెగ్‌ చాపెల్‌ 2022లో ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ను చివరిసారిగా కలిశారు. అప్పట్లో ఇమ్రాన్‌ పూర్తిగా ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారని చాపెల్‌ గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం, జైలు పరిస్థితులకు సంబంధించిన వార్తలు అందుకు భిన్నంగా ఉండటం తమను కలవరపెడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు గ్రెగ్‌ చాపెల్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

    ‘ఆయన జైలులోనే చనిపోతాడేమోనని మేం ఆందోళన చెందుతున్నాం. గత ఆరు నెలల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌ కెప్టెన్ల నుంచి ఇలాంటి లేఖలు రెండుసార్లు వచ్చాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. తాజాగా ఇమ్రాన్‌ కుమారులు, సోదరీమణులు కూడా ఆయన ఆరోగ్యం, జైలు పరిస్థితులపై బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’ అని చాపెల్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి ఇమ్రాన్‌ ఖాన్‌కు మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం, న్యాయ సహాయం వంటి కనీస సౌకర్యాలు అందేలా చూడాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఏడుగురు మాజీ కెప్టెన్లు కోరారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement