• Sep 20, 2026
  • NPN Log

    ‘డిజిటల్ కామోఫ్లేజ్’ పేరుతో జర్మన్ డిజైనర్ సైమన్ వెకెర్ట్ ఓ రంగురంగుల చొక్కాను రూపొందించారు. ఈ చొక్కా డిజైన్ వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉంది. దీన్ని ధరిస్తే AI, CCTV కెమెరాలు సైతం మనిషిగా గుర్తించడంలో తికమకపడతాయట. ప్రత్యేకమైన రంగులతో రూపొందించిన ఈ చొక్కా AI కెమెరాల గుర్తింపు వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తుంది.

    AIని చొక్కా ఎలా మోసం చేస్తుంది?

    మనుషులు చూసినట్లు AI కెమెరాలు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవు. అవి గతంలో చూసిన లక్షలాది చిత్రాల ఆధారంగా కొన్ని నమూనాలను గుర్తిస్తాయి. మనిషిని గుర్తించేటప్పుడు శరీర ఆకారం, అంచులు, రంగులు, ఆకృతులు వంటి వివరాలను పరిశీలిస్తాయి. డిజిటల్ కామోఫ్లేజ్ చొక్కాలోని రంగులు, రకరకాల ఆకారాలు ఈ వివరాలను గందరగోళానికి గురిచేస్తాయి. దీంతో కెమెరా తాను చూస్తున్నది మనిషేనని గుర్తించడం కష్టమవుతుంది. ఈ డిజైన్‌ను రూపొందించడంలో వెకెర్ట్ AI సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఒక నమూనాను తయారు చేసి, దాన్ని AI డిటెక్షన్ సిస్టమ్‌తో పరీక్షించి, కెమెరా.. వ్యక్తిని ఎంత సులభంగా గుర్తిస్తుందో చూశారు. ఆ తర్వాత నమూనాలో మార్పులు చేస్తూ మళ్లీ పరీక్షించారు. ఇలా AIకి వ్యక్తిని గుర్తించడం కష్టమయ్యే వరకు చొక్కా డిజైన్‌ను మెరుగుపరిచారు.

    ఈ ప్రయోగాన్ని YOLO అనే ఓపెన్‌సోర్స్ AI వ్యవస్థతో కూడా పరీక్షించారు. వస్తువులు, మనుషులను గుర్తించేందుకు ఇలాంటి సాంకేతికతను పలు కంప్యూటర్ విజన్ వ్యవస్థల్లో ఉపయోగిస్తారు. ఇలాంటి ప్రయోగాలను ‘అడ్వర్సేరియల్ క్లోతింగ్’ అంటారు. AI కెమెరాలు వ్యక్తులను తప్పుగా గుర్తించేలా లేదా గుర్తించలేకపోయేలా ప్రత్యేక దుస్తుల నమూనాలను రూపొందించడం దీని ఉద్దేశం. అయితే ఈ చొక్కా అన్ని CCTV కెమెరాలను తప్పించుకోగలదని వెకెర్ట్ చెప్పడం లేదు. AI ఆధారిత కెమెరాల పరిమితులు, వాటిలో ఉండే లోపాలను చూపించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని సైమన్‌ వెకెర్ట్‌ చెబుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement