• Sep 20, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) తప్పనిసరి కవరేజ్‌ వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలన్న కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా అదనంగా 51 లక్షల మందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వారందరికీ చట్టబద్ధమైన పీఎఫ్‌ రక్షణ లభించనుంది. గడిచిన రెండున్నర దశాబ్దాల్లో రెండుసార్లు మాత్రమే ఈ పరిమితిని పెంచారు. వాజ్‌పేయీ హయాంలో 2001 జూన్‌ 1న.. రూ.5000గా ఉన్న పీఎఫ్‌ తప్పనిసరి కవరేజ్‌ పరిమితిని రూ.6500కు పెంచారు. ఆ తర్వాత మళ్లీ 2014 సెప్టెంబరులో మోదీ సర్కారు ఈ పరిమితిని రూ.6500 నుంచి రూ.15 వేలకు పెంచింది. పుష్కరకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు పెంచారు. పెన్షన్‌ స్కీమ్‌పై ప్రభుత్వం చేస్తున్న వార్షిక బడ్జెటరీ వ్యయం.. ఈ నిర్ణయం కారణంగా రూ.10,250 కోట్ల నుంచి రూ.11,339 కోట్లకు పెరగనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ వ్యయం రూ.56,696 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని కార్మికుల సామాజిక భద్రతను మరింత పెంచడమే కాక, ఉపాధిరంగం వ్యవస్థీకృతం కావడాన్ని వేగవంతం చేస్తుందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. గురువారం (సెప్టెంబరు 17) విశ్వకర్మ జయంతి, సేవాదివస్‌ రెండూ కలిసివచ్చిన పవిత్ర సందర్భంగా.. ఆ శుభదినం నుంచే ఈ ముఖ్యమైన నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు.

     

     

    క్యాప్‌ రూ.1800 నుంచి రూ.3000కు..

    సాధారణంగా పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ను కంపెనీలు రెండు రకాలుగా లెక్కించి జమ చేస్తాయి. కొన్ని కంపెనీలు కేవలం గరిష్ట వేతన పరిమితిపైనే పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ను లెక్కిస్తాయి. మరికొన్ని కంపెనీలు.. బేసిక్‌ వేతనం ఎంత ఉంటే అంత మేరకు 12ు చొప్పున లెక్కించి జమ చేస్తాయి. ఉదాహరణకు.. కొన్ని కంపెనీలు.. ఒక ఉద్యోగి బేసిక్‌ వేతనం రూ.30 వేలు అయినప్పటికీ, గరిష్ఠ పరిమితి అయిన రూ.15 వేలలో 12ు.. అంటే రూ.1800 మాత్రమే ఆ ఉద్యోగి జీతం నుంచి కట్‌ చేసి పీఎఫ్‌ ఖాతాకు జమచేస్తాయి. మరో రూ.1800 తమ వాటాగా జమచేస్తాయి. మరికొన్ని కంపెనీలు.. ఉద్యోగి బేసిక్‌ వేతనం రూ.30 వేలు ఉంటే అందులో 12ు అంటే.. రూ.3600 ఉద్యోగి వాటాగా, మరో రూ.3600 తమ వాటాగా జమ చేస్తాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో గరిష్ఠ పరిమితి పెరగడం వల్ల.. ఉద్యోగుల వాటాపై పరిమితి ప్రస్తుతం ఉన్న రూ.1800 నుంచి రూ.3000కు పెరగనుంది. కంపెనీ కూడా తమ వాటాగా అంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement