• Jun 25, 2026
  • NPN Log

    వాషింగ్టన్‌ : నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులకు గ్రీన్‌కార్డు ఉన్నా కూడా.. అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించవచ్చని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం చేసినట్లు రుజువు చేసే స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకపోయినా, అనుమానం ఆధారంగా కూడా ఇమిగ్రేషన్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. తద్వారా వలసదారులపై ఆంక్షల కత్తి ఝుళిపిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వ విధానాన్ని సమర్థించింది. ఓ చైనా జాతీయుడి గ్రీన్‌కార్డును రద్దు చేసిన కేసులో 6:3 మెజారిటీతో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చైనాకు చెందిన ముక్‌ చొయ్‌ లా అనే వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు 2007లో గ్రీన్‌కార్డు లభించింది. దాదాపు మూడు లక్షల డాలర్ల విలువైన నకిలీ వస్తువులను విక్రయించిన కేసులో పోలీసులు 2012 మే నెలలో ముక్‌ చొయ్‌ లాను అరెస్టు చేశారు. అనంతరం విడుదలైన ముక్‌ చొయ్‌ లా.. చైనాకు వెళ్లి కొన్ని రోజులపాటు అక్కడ ఉండి జూన్‌లో తిరిగొచ్చారు. అయితే విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు ఆయనను అనుమతించలేదు. విచారణ పెండింగ్‌లో ఉన్నందున అమెరికాలో శాశ్వత నివాసం ఉండటానికి వీల్లేదని, తాత్కాలిక ప్రాతిపదికనే ఉండవచ్చని తెలిపారు. దీనిని ముక్‌ చొయ్‌ లా ఫెడరల్‌ అప్పీళ్ల కోర్టులో సవాల్‌ చేయగా.. నేరం రుజువు కాకముందే ఆయన హక్కులను రద్దు చేయటం సరికాదని కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు, నేరాన్ని అంగీకరించిన ముక్‌ చొయ్‌ను చైనాకు తిరిగి పంపించారు. సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసుపై విచారణ జరిపి.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. నేరం రుజువు కాకపోయినా తీవ్రమైన ఆరోపణలు ఉంటే గ్రీన్‌కార్డు ఉన్న వారిని సైతం అదుపులోకి తీసుకోవచ్చని, వారికి అమెరికాలో శాశ్వత నివాసహక్కును (గ్రీన్‌కార్డును) నిరాకరించవచ్చని తీర్పునిచ్చింది.

    నేరానికి పాల్పడినట్లు కచ్చితమైన సాక్ష్యాధారాలు ఉంటేనే ఈ పని చేయాలని ‘ఇమిగ్రేషన్‌, నేషనాలిటీ చట్టం’లో ఎక్కడా లేదని తెలిపింది. తద్వారా అవినీతి, దొంగతనం, అక్రమ వ్యాపారం వంటి నేరాలకు పాల్పడినట్లు ఇమిగ్రేషన్‌ అధికారులు భావించినా.. గ్రీన్‌కార్డుదారులను అమెరికాలోకి రాకుండా అడ్డుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ అనుమతించినా ఆంక్షలతో కూడిన అనుమతి మంజూరు చేయవచ్చని వెల్లడించింది. ధర్మాసనంలో ఉన్న తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు దీనికి అనుకూలంగా ఉండగా.. ముగ్గురు వ్యతిరేకించారు. ఈ తీర్పుతో ఇమిగ్రేషన్‌ చట్టాన్ని, నిబంధనల్ని ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మార్చే ప్రమాదం ఉందని ముగ్గురు జడ్జిలు హెచ్చరించారు. అమెరికా ఇంతకాలంగా అనుసరిస్తున్న ‘నేరం రుజువయ్యే వరకూ అందరూ నిర్దోషులే’ అనే న్యాయసూత్రానికి ఇది విరుద్ధమైన తీర్పు అని పేర్కొన్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement