డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు కేసీఆర్ ఘన నివాళి
హైదరాబాద్ : భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా జాతికి ఆయన చేసిన కృషితోపాటు సేవలను మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం వర్ణ, కుల, మత, లింగ బేధాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేడ్కర్ అని కేసీఆర్ అభివర్ణించారు.
భారత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల్లో మానవీయత ఫరిడవిల్లి, విశ్వనరుడుగా భారత పౌరుడు ఎదిగేందుకు దోహదం చేసేలా రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని కేసీఆర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తు చేశారు. దేశ ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి అంబేడ్కర్ చేసిన కృషి మహోన్నతమైనదని ప్రశంసించారు.
దళిత, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం.. అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం మొదటి పదేళ్ల పాలనలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక కార్యాచరణను అమలు చేసిందని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో డా. బి. ఆర్. అంబేడ్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించామన్నారు. రాష్ట్ర పరిపాలనలో అంబేడ్కర్ స్ఫూర్తిని నింపే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు.
అంబేడ్కర్ ఆశయాలను నిత్యం స్మరించుకుంటూ, వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, రేపటి తరాలలో నిత్య చైతన్యం కలిగించేందుకు, దేశంలో మరే రాష్ట్రం ఏర్పాటు చేయని విధంగా, ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ ప్రతి రూపాన్ని, విగ్రహం రూపంలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించుకున్నామని పేర్కొన్నారు.










Comments