మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులారా.. జాగ్రత్త!: సీపీ సజ్జనార్
హైదరాబాద్ : నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. వైద్య విద్యపై ఉన్న అపారమైన క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకోవాలని కొందరు మోసగాళ్లు, దళారులు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్త వహించాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీపీ విన్నవించారు. ‘మీ పిల్లలు నీట్లో తక్కువ మార్కులు సాధించినా, మేనేజ్మెంట్ కోటాలో చాలా తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని లేదా ఫిలిప్పీన్స్, కిర్గిజ్‌స్థాన్, కజకిస్థాన్, జార్జియా, చైనా, అర్మేనియా, కరేబియన్ దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చని ఆకర్షణీయంగా చెప్పి మోసం చేసే ఏజెంట్ల మాటలు నమ్మవద్దు’ అని హెచ్చరించారు.
గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ముఠాలు అనేక మంది తల్లిదండ్రులను మోసం చేశాయని సీపీ గుర్తుచేశారు. ఎందరో తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోగా, విద్యార్థులు విలువైన సంవత్సరాన్ని కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. విదేశీ వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే.. ఆ కాలేజీకి భారత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉందో లేదో అధికారిక వెబ్సైట్లో తప్పకుండా పరిశీలించాలని.. లేదా స్వయంగా అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని సూచించారు.
అడ్మిషన్ల పేరుతో దళారుల చేతికి నగదు రూపంలో లక్షల రూపాయలు ఇవ్వొద్దని సజ్జనార్ తెలిపారు. ఏ ఫీజులు చెల్లించాల్సి వచ్చినా నేరుగా సంబంధిత యూనివర్సిటీ, కాలేజీ బ్యాంక్ ఖాతాకే చెల్లించాలన్నారు. విద్యార్థులు ఎంతో కష్టపడి సాధించిన ఫలితాలను, భవిష్యత్తు కలలను ఈ నకిలీ ఏజెంట్ల చేతుల్లో పెట్టి ఆందోళనకు గురికావద్దని సూచించారు. ఎంబీబీఎస్ సీట్ల పేరుతో ఎవరైనా సంప్రదించినా, డబ్బుల కోసం వేధిస్తున్నా వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని.. సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. ‘మీ పిల్లలను డాక్టర్లుగా చూడాలనే ఆశతో మోసగాళ్ల మాయమాటల ఉచ్చులో పడకండి’ సీపీ సజ్జనార్ విన్నవించారు.







Comments