బోడెన్సీ సరస్సు ఈదిన డీఎస్సీ విజేత
ఏలూరు : అంతర్జాతీయ వేదికపై తెలుగు పారా స్విమ్మర్ అరుదైన ఘనత సాధించారు. ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన పారా స్విమ్మర్, స్విమ్మింగ్ కోచ్ బలగ గణేశ్... సుప్రసిద్ధ బోడెన్సీ సరస్సులో 12 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 14 నిమిషాల 13 సెకన్లలోనే ఈది సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. జర్మనీలోని ఫ్రెడ్‌రిక్‌షాఫెన్ నుంచి స్విట్జర్లాండ్‌లోని రోమన్స్‌హార్న్ వరకూ విస్తరించి ఉన్న బోడెన్సీ సరస్సులో ఈ నెల 12న ఈ రికార్డు నెలకొల్పినట్టు ఆయన మంగళవారం వెల్లడించారు.
16.5 డిగ్రీల అత్యంత శీతల వాతావరణంలో వెట్‌సూట్ లేకుండా ఆయన ఈ ఘనత సాధించడం విశేషం. ఈ క్రమంలో 5 గంటల 33 నిమిషాల టైమింగ్‌తో జర్మనీకి చెందిన పారా స్విమ్మర్ స్వెన్ ఎకార్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును గణేశ్ బ్రేక్ చేశారు. పదేళ్లపాటు ఏలూరులో స్విమ్మింగ్ కోచ్‌గా పనిచేసిన గణేశ్... మెగా డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. గణేశ్ మాస్టార్ మాట్లాడుతూ... ‘ఇది నా జీవితంలో గొప్ప రోజు. ఉపాధ్యాయుడిగా సేవచేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను’ అని అన్నారు. కాగా, బలగ గణేశ్ మాస్టారుకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ‘మా ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన గణేశ్ మాస్టారు పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పడం మనందరికీ గర్వకారణం’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.










Comments