• Sep 20, 2026
  • NPN Log

    బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలని సూచించాడు. ఇందులో భాగంగా సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరభ్‌ గంగూలీ, రవిశాస్త్రి, అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి మాజీ ఆటగాళ్లతో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు.

    ఇటీవల దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ వ్యవహరించిన తీరుపై గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్‌ జోన్‌.. ఆ ఆధిక్యంతోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీనిపై స్పందించిన గావస్కర్‌.. దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థతో పాటు బీసీసీఐలోనూ మరింత విస్తృత ఆలోచన అవసరమని పేర్కొన్నాడు.

    ‘నేను బీసీసీఐ టెక్నికల్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రంజీ ట్రోఫీలో జోనల్‌ విధానాన్ని తొలగించి.. ఎలైట్‌, ప్లేట్‌ టోర్నీలను తీసుకొచ్చాం. దీనివల్ల ఆటగాళ్లు తమ సొంత జోన్‌కే పరిమితం కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో, భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఆడే అనుభవం పొందారు. అలాగే పాయింట్ల విధానంలోనూ మార్పులు తీసుకొచ్చాం. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యానికి ఒక పాయింట్‌, మ్యాచ్‌ను నేరుగా గెలిస్తే రెండు పాయింట్లు ఇచ్చేలా నిబంధనలు మార్చాం. అదనపు బోనస్‌ పాయింట్లకు స్వస్తి పలికాం’ అని గావస్కర్ వివరించాడు.

    దిగ్గజాలతో ప్రత్యేక కమిటీ..

    ప్రస్తుతం బీసీసీఐలో సెలెక్షన్‌ కమిటీలు, క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మినహా పెద్దగా కమిటీలు లేవని గావస్కర్‌ వెల్లడించాడు. సీఏసీ పరిధిని మరింత విస్తరించి.. కేవలం సెలెక్టర్లు, కోచ్‌ ఎంపికకే పరిమితం కాకుండా దేశవాళీ, అంతర్జాతీయ షెడ్యూల్స్‌ సహా భారత క్రికెట్‌కు సంబంధించిన కీలక అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునేలా చేయాలని సూచించాడు. ‘అత్యంత అనుభవం ఉన్న మాజీ క్రికెటర్లు చాలామంది ఉన్నారు. వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరభ్‌ గంగూలీ, రవిశాస్త్రి, అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి వారిని ఈ కమిటీలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి కూడా ఇందులో ఉంటారు’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

    మహిళల క్రికెట్‌కూ ఇదే విధానం

    ఈ కమిటీ కోచ్‌, కెప్టెన్‌, ఎన్‌సీఏ అధిపతితో చర్చలు జరిపితే.. దాని నిర్ణయాలకు ఎంతో బలం ఉంటుందని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. అనుభవం, నైపుణ్యం కలిగిన దిగ్గజాలు కలిసి భారత క్రికెట్‌ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని అన్నాడు. మహిళల క్రికెట్‌ కోసం కూడా ఇదే తరహాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించాడు. అనుభవం, నైపుణ్యం కలిగిన మాజీ క్రికెటర్లు కలిసి భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే నిర్ణయాలు తీసుకోవాలని గావస్కర్‌ ఆకాంక్షించారు. ‘ఇలా ఆలోచిస్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇది ఎప్పుడైనా జరుగుతుందా? లేక కేవలం ఓ కలగానే మిగిలిపోతుందా?’ అని గావస్కర్ తన ప్రతిపాదనను ముగించాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement