• Sep 20, 2026
  • NPN Log

    మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఛార్జర్ కాస్త వేడెక్కడం సాధారణమే. కానీ ఆ ఛార్జర్ పట్టుకోవడానికే ఇబ్బందిగా ఉన్నంత వేడిగా మారి.. కాలిన వాసన వస్తున్నా, తరచూ ఛార్జింగ్ ఆగిపోతున్నా నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఛార్జర్ గృహ విద్యుత్‌ను ఫోన్‌కు తగినట్టుగా లో-వోల్టేజ్ విద్యుత్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియలో అది సహజంగానే వేడెక్కుతుంది. పైగా ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఛార్జర్లను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి వేగంగా ఛార్జ్ చేయడం వల్ల ఉష్ణోగ్రతలు ఇంకొంచెం పెరుగుతాయి. అయితే ఇదేమీ ఆందోళన చెందాల్సిన విషయం కాదని ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ శాంసంగ్ కూడా చెబుతోంది. ఛార్జింగ్ ప్రక్రియలో ఫోన్, అడాప్టర్‌ల ఉష్ణోగ్రతలు పెరగడం సాధారణమే అని అది వివరిస్తోంది. అయితే ఆ ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే జాగ్రత్త పడడం మంచిది.

    ఎంత వేడి సాధారణం?

    ఫోన్ ఛార్జర్లు కొద్దిగా వెచ్చగా లేదా గోరువెచ్చగా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ వేడి తాకడానికే ఇబ్బందిగా అనిపించేలా ఉండకూడదు. అయితే ఏ ఉష్ణోగ్రతలను సాధారణంగా పరిగణిస్తారు?.. అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది ఒక్కో ఛార్జర్‌కు ఒక్కోలా ఉంటుంది. వివిధ ఛార్జర్లు, వోల్టేజ్ సామర్థ్యాలు, రూమ్ టెంపరేచర్ వంటి వాటిపై సాధారణ ఉష్ణోగ్రతలు ఆధారపడతాయి.

    ఇలా ఉంటే నిర్లక్ష్యం చేయకండి

    ఒకవేళ ఛార్జర్ విపరీతంగా వేడెక్కినా, కాలిన వాసన వస్తున్నా వెంటనే ఛార్జింగ్ ప్రక్రియను ఆపివేయండి. లేకపోతే ఆ ఛార్జర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. నాసిరకం అడాప్టర్ల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు. పాతబడిన కేబుళ్ల కారణంగా కూడా ఛార్జర్లు అధికంగా వేడెక్కుతాయి. అందుకే బ్రాండెడ్ అడాప్టర్లు, కేబుళ్లు వినియోగించండి. అలాగే తరచూ వాటిని పరిశీలించండి.

    ఛార్జర్లను దిండు కింద పెట్టకండి

    ఛార్జర్‌ను దిండ్ల కింద, దుప్పట్ల కింద పెట్టకండి. అలాగే ఇతర ఇరుకైన ప్రదేశాల్లో దాన్ని ఉంచకండి. గాలి బాగా ప్రసరించే చోటే ఛార్జర్ ఉండాలి. ఎందుకంటే ఇరుకుగా ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల అది విపరీతంగా వేడెక్కుతుంది. ఛార్జింగ్ చేస్తున్నప్పడు గేమ్స్ ఆడడం, ఫోన్ చూడడం వంటివి అసలు చేయకండి. దీని వల్ల ఛార్జింగ్ వేగం తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఛార్జర్ వేడెక్కడం గమనిస్తే వెంటనే దానికి విద్యుత్ సరఫరా ఆపి, కాసేపు చల్లారనివ్వండి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement