మార్కెట్ మాంత్రికుడి పెట్టుబడి సూత్రాలు
వారెన్ బఫెట్.. ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఒకరు. ఐదు దశాబ్దాలకుపైగా బెర్క్‌షైర్ హ్యాత్‌వే కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరించిన 96 ఏళ్ల బఫెట్.. తాజాగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. విలువ ఆధారిత పెట్టుబడులు, క్రమశిక్షణ తో సంపదను సృష్టించే విధానానికి బఫెట్ పెట్టింది పేరు. స్టాక్ మార్కెట్ మాంత్రికుడిగా పేరొందిన ఆయన సుదీర్ఘ పెట్టుబడి ప్రస్థానం పెట్టుబడిదారులకు కొన్ని విలువైన పాఠాలను నేర్పుతుందనడంలో అతిశయోక్తి లేదు. దీర్ఘకాలిక ఆలోచనతో పాటు క్రమశిక్షణతో వ్యవహరించడం, పెట్టుబడి పెడుతున్న దాన్ని అర్థం చేసుకోవడం, మార్కెట్లోని తాత్కాలిక ఒడుదొడుకుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం.. వారెన్ బఫెట్ పెట్టుబడి విధానాల్లో ముఖ్యమైనవి.
బఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన వాటిలో కొన్ని..
బఫెట్ పెట్టుబడి విధానం ఎప్పుడూ సూటిగా ఉంటుంది. మంచి వ్యాపారం చేసే కంపెనీల షేర్లు తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయాలి. ధరలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తొందరపడకుండా దూరంగా ఉండాలి. ఒకసారి పెట్టుబడిని ఎంచుకున్న తర్వాత ఓపికగా వ్యవహరించాలి. ఈ విధానమే బఫెట్ విలువ ఆధారిత పెట్టుబడికి పునాది.
మార్కెట్లో రోజూ చోటు చేసుకునే ఒడుదొడుకులకు ఎప్పుడూ తొందరపడి స్పందించి నిర్ణయాలు తీసుకోవద్దు. ఓపికతో వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఇదే బఫెట్ విజయ రహస్యం.
ఇతరులు అత్యాశతో ముందుకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందరూ భయపడి వెనకడుగు వేస్తున్నప్పుడు ధైర్యంగా అవకాశాన్ని వినియోగించుకోవాలి. గుడ్డిగా అందరూ నడిచే దారిలో వెళ్లకుండా సొంతంగా ఆలోచించాలి. అందరూ కొంటున్నారని కొనడం, అ మ్ముతున్నారని అమ్మడం చేయకూడదు.
బఫెట్ చెప్పిన మొదటి నియమం ఏమిటంటే.. ఎప్పుడూ డబ్బు పోగొట్టుకోకండి. రెండో నియమం ఏమిటంటే.. మొదటి నియమాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. కష్టకాలం వచ్చినప్పుడే ఎవరు ఎంత రిస్క్ తీసుకున్నారో తెలుస్తుంది కాబట్టి ఎప్పుడూ నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి.
మీ చుట్టూ ఉండే వారు మీ ఆలోచనలు, నిర్ణయాలు, జీవితాన్ని ప్రభావితం చేస్తారు. మీరు ఎవరితో కలిసి ముందుకు సాగుతున్నారనేది అత్యంత ముఖ్యం. తాము తీసుకునే ప్రతి నిర్ణ యం సరైనదేనని అనుకోవద్దు. మనం కలిసి పని చేసే వ్యక్తుల దిశగా సాధారణంగా మన ప్రయాణం సాగుతుంది. కాబట్టి మీ నిర్ణయాలను ప్రభావితం చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి.










Comments