• Sep 20, 2026
  • NPN Log

    సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు భారత మాజీ క్రికెట్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మనకు అందించిన కనులవిందును ఏ క్రికెట్ అభిమాని కూడా మరిచిపోలేడు. టీ20 క్రికెట్ చరిత్రలో నాడు ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను యువీ ఉతికారేసిన ఘట్టాన్ని సగటు క్రికెట్ అభిమాని పదేపదే తలచుకుని ఆనందిస్తాడు. బ్రాడ్ వేసిన ఆ ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన రోజును ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ చారిత్రక ఘట్టం జరిగి నేటికి 19 ఏళ్లు పూర్తయ్యాయి.

    ఫ్లింటాఫ్‌తో మాటల యుద్ధం

    అది 2007 సెప్టెంబర్ 19.. దక్షిణాఫ్రికాలో తొలి టీ20 ప్రపంచ కప్ టోర్నీ కొనసాగుతోంది. భారత్ సూపర్ 8కు చేరింది. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో భారత్‌‌కు ఓటమి ఎదురైంది. టోర్నీలో నిలవాలంటే రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఇంగ్లండ్ కాగా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. డాషింగ్ బ్యాటర్ యువీ క్రీజులోకి వచ్చేసరికి భారత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు155 పరుగులతో మెరుగైన స్థితిలోనే ఉంది. 18వ ఓవర్ ముగిశాక ఇంగ్లండ్ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్.. యువీతో మాటల యుద్ధానికి దిగాడు. యువీ కూడా ఫ్లింటాఫ్‌కు నోటితో పనిచెప్పాడు. 19వ ఓవర్ వేసేందుకు ప్రత్యర్థి కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్.. స్టువర్ట్ బ్రాడ్‌కు బంతినిచ్చాడు.

    అప్పుడే.. ఎవరూ ఊహించని అద్భుతం

    బ్రాడ్ బంతి అందుకున్నాడు. ఫస్ట్ బాల్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా యువీ సిక్స్ కొట్టాడు. రెండో బంతి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్. మూడో బంతి డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా మరో సిక్స్. నాలుగో బంతి కూడా అదే తరహాలో గ్యాలరీలో పడింది. ఇక ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు యువీ. చివరి బంతికి భారత క్రికెట్ అభిమానులందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. క్రికెట్‌ చరిత్రలో అత్యంత అరుదుగా జరిగే అద్భుతాన్ని యువీ సాధిస్తాడా అని టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది ఫ్యాన్స్ టెన్షన్. చివరి బంతిని కూడా లాంగ్‌ఆన్ మీదుగా సిక్సర్ బాదాడు యువీ. అంతే.. దేశవ్యాప్తంగా అభిమానులందరిలోనూ ఆనందం. టీ20 ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా యువరాజ్ సింగ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో యువీ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ రికార్డు కూడా కొన్నేళ్ల పాటు పదిలంగా ఉండింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా 18 పరుగుల తేడాతో గెలిచింది. అంతేకాకుండా తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మరో సూపర్ 8 మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి సగర్వంగా పొట్టి కప్‌ను ముద్దాడింది టీమ్ఇండియా.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement