• Sep 20, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: తెలుగమ్మాయి, 19 ఏళ్ల సాహితి వర్షిణికి మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం) హోదా దక్కింది. ఇందుకు సంబంధించిన మూడో నార్మ్‌ను సెర్బియాలో జరిగిన ఐఎం-7 రౌండ్‌రాబిన్‌ టోర్నీలో వర్షిణి సొంతం చేసుకొంది. ఈ టోర్నీలో మొత్తం 9 రౌండ్ల నుంచి 6 పాయింట్లు సాధించిన వర్షిణి రెండో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన నీలేష్‌ సాహా, వేదాంత్‌ పనేసర్‌పై సాహితి గెలిచింది. 2408 పర్ఫామెన్స్‌ రేటింగ్‌ను నమోదు చేసిన వర్షిణి.. 23 రేటింగ్‌ పాయింట్లు సాధించింది. గతేడాది సెప్టెంబరులో హంగేరిలో జరిగిన గోల్డెన్‌ హార్స్‌ ఐఎం రౌండ్‌రాబిన్‌ టోర్నీలో తొలి నార్మ్‌ దక్కించుకొన్న వర్షిణి.. ఈ ఏడాది ఆగస్టులో కనిజ్‌సా ఓపెన్‌లో రెండో నార్మ్‌ కైవసం చేసుకొంది.

    నాన్న బాటలో..

    ముంగి సాహితి వర్షిణి. విశాఖపట్నానికి చెందిన ఈ 19 ఏళ్ల చెస్‌ క్రీడాకారిణి మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న మూడో ఆంధ్ర అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. తండ్రి లోకేశ్వరరావు స్వతహాగా చెస్‌ క్రీడాకారుడు కావడంతో తన ఇద్దరమ్మాయిలను కోనేరు హంపిలా ప్రపంచం మెచ్చే క్రీడాకారిణులుగా చేయాలని కలలు కనేవాడు. చెస్‌లో రెండో అమ్మాయి సాహితి చురుకుదనం చూసి ఆమెకు ఐదున్నరేళ్ల ప్రాయంనుంచే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. రెండేళ్లు తిరిగేసరికి సాహితి రాష్ట్ర స్థాయిలో చాంపియన్‌, జాతీయ స్థాయిలో రన్నరప్‌ టైటిళ్లు కొల్లగొట్టింది. దీంతో చదరంగాన్ని కెరీర్‌గా ఎంచుకొని ముందుకు సాగింది.

    మలుపు తిప్పిన ఆసియా పోటీలు..

    ఉజ్బెకిస్థాన్‌లో 2017లో జరిగిన ఆసియా చెస్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో సాహితి క్లాసికల్‌, బ్లిట్జ్‌ రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు కొల్లగొట్టింది. ఆతర్వాతి ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఇవే పోటీల్లో క్లాసికల్‌, ర్యాపిడ్‌లో వ్యక్తిగత స్వర్ణాలు, బ్లిట్జ్‌లో కాంస్యం, ఈ మూడు టీమ్‌ విభాగాల్లో స్వర్ణాలు నెగ్గి, మొత్తం ఆరు పతకాలను తన ఖాతాలో వేసుకొని సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ పోటీల్లో ఆడలేకపోయిన సాహితి, పరిస్థితులు చక్కబడిన అనంతరం 2023 నుంచి తిరిగి ప్రధాన పోటీల బరిలో నిలిచింది. గత ఏడాది హంగేరిలో జరిగిన గోల్డెన్‌ హార్స్‌ టోర్నమెంట్‌లో తొలి జీఎం నార్మ్‌ దక్కించుకున్న సాహితి, గత నెలలో హంగేరిలోనే జరిగిన కనిజా స్ట్రాంగ్‌ ఓపెన్‌ టోర్నీలో రెండో నార్మ్‌ను, సోమవారం సెర్బియాలో జరిగిన ఐఎం రౌండ్‌రాబిన్‌ టోర్నీలో మూడో నార్మ్‌ను సాధించి, విమెన్‌ గ్రాండ్‌మాస్టర్‌ కిరీటం దక్కించుకుంది. వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ఆడడంతో పాటు ప్రపంచ టాప్‌-10లో చోటు సంపాదించడం తన లక్ష్యమని సాహితి తెలిపింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement