అల్రా మన భారీ బాంబర్
న్యూఢిల్లీ : ఎక్కడో అమెరికాలోని మిస్సోరీ నుంచి వేలాది కిలోమీటర్లు ఎగిరివచ్చి ఇరాన్‌లో అణుకేంద్రాలపై చేసిన దాడులతో అమెరికా బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు కలకలం రేపాయి. ప్రపంచమంతా వాటి గురించే చర్చ జరిగింది. అలాంటి బాంబర్లు మనకూ ఉంటే బాగుంటుందనే ఆశాభావమూ వ్యక్తమైంది. అయితే ఇప్పుడు కాకున్నా కొన్నేళ్లలో భారత్ వద్ద కూడా భారీ బాంబర్ విమానాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ‘అలా్ట్ర లాంగ్ రేంజ్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్ (అల్రా)’ పేరిట ఆలోచన మొగ్గతొడిగినట్టు రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రష్యా, ఫ్రాన్స్‌లతో పలు సాంకేతికతల బదిలీకి సంబంధించి చర్చలు కూడా ప్రారంభమైనట్టు వివరిస్తున్నారు.
అమెరికా బాంబర్‌కు దీటుగా..?
ప్రస్తుతం అమెరికా బీ-2 స్పిరిట్ కన్నా సమర్థవంతమైన బీ-21 రైడర్ బాంబర్లను అభివృద్ధి చేసింది. వాటి ప్రయాణ సామర్థ్యం సుమారు 9,300 కిలోమీటర్లు. చైనా కూడా హెచ్-20 పేరిట 8 వేల కిలోమీటర్లపైన సామర్థ్యమున్న బాంబర్‌ను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు రష్యా వద్ద ఉన్న టీయూ-160 బ్లాక్‌జాక్ బాంబర్ సామర్థ్యం 12,300 కిలోమీటర్ల పైమాటే. అది ప్రపంచంలోనే వేగవంతమైన, భారీ సూపర్ సోనిక్ బాంబర్ కూడా. భారత్ దీని తరహాలోనే ‘అల్రా’ బాంబర్లను ఏకబిగిన 12 వేల కిలోమీటర్ల సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేయాలని భావిస్తోందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంటే ఇక్కడ బయలుదేరితే నేరుగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వరకు చేరుకుని దాడి చేయవచ్చు.
ఇరుగుపొరుగు దేశాలే కాదు.. యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలన్నింటికీ చేరుకోగలదు. ఈ బాంబర్‌ను ‘స్వింగ్ వింగ్’ మోడల్ రెక్కలు అమర్చాలన్న ప్రతిపాదన ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో రెక్కలు అడ్డంగా విప్పార్చుకుని సురక్షితంగా, సులువుగా దిగేందుకు, ఎగిరేందుకు అనువుగా ఉంటాయి. గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాస్త వెనక్కి ముడుచుకుంటాయి. దీనితో విమానం తక్కువ ఇంధనంతో, ఎక్కువ వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న బ్రహ్మోస్ ఎన్‌జీతోపాటు ఇతర అత్యాధునిక క్షిపణులను, భారీ బాంబులను మోసుకెళ్లేలా అల్రాను అభివృద్ధి చేయనున్నారు. ‘‘బ్రహ్మోస్ కొత్త వెర్షన్లతోపాటు అగ్ని 1పీ క్షిపణులు, లేజర్ బాంబులు, యాంటీ రేడియేషన్ క్షిపణులు కూడా ఉండాలన్నది మా ఆలోచన’’ అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సీనియర్ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.
అంత సులువేమీ కాదు!
భారీ బాంబర్ విమానాల తయారీ అంత సులువేమీ కాదని, ఇది సుదీర్ఘకాల లక్ష్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారీ బాంబర్‌కు అవసరమైన ఎయిర్‌ఫ్రేమ్ నుంచి ఇంజన్ల దాకా ఎంతో శ్రమ, ఖర్చు, అత్యాధునిక సాంకేతికతల అవసరం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. బాంబర్ పరిశోధన, అభివృద్ధిలో డీఆర్‌డీవో, హాల్, ఎయిర్‌క్రాఫ్ట్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ) తదితర సంస్థలన్నీ విస్తృతస్థాయిలో భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. భారత్ ప్రయత్నాలు ఫలిస్తే 2035 నాటికి మొదటి ప్రొటోటైప్ సిద్ధం కావొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ‘మేం సిద్ధం’ అని భారత్ ప్రపంచానికి చాటనుందని అంటున్నారు.
Comments