ఇరాన్లో మారణ హోమం.. 2500 మందికి పైగా మృతి..
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, అవినీతికి వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల కారులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరు మారణ హోమానికి కారణమైంది. ఆందోళనకారులను అణిచివేసేందుకు భద్రతా దళాలను ప్రభుత్వం రంగంలోకి దింపడం పెను విధ్వంసానికి దారి తీసింది. గత మూడు వారాలుగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు 2,571 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇరాన్ ఆందోళనల్లో ఇప్పటివరకు 2,571 మంది మృతి చెందారని, వారిలో 2,403 మంది ఆందోళనకారులని, 147 మంది భద్రతా సిబ్బంది అని అమెరికా కేంద్రంగా పని చేసే మానవ హక్కుల ఉద్యమకారుల సంస్థ ప్రకటించింది. ఈ ఘర్షణలతో ఏమాత్రం సంబంధం లేని 12 మంది చిన్నారులు, 9 మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు సదరు సంస్థ వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు 18 వేల మంది నిరసనకారులను ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.
కాగా, ఇరాన్లో ఆందోళనలను మరింతగా రెచ్చగొట్టేలా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు చేస్తూనే ఉండాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాయం అందించేందుకు వస్తున్నామని హామీనిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా సైనిక చర్యకు సిద్ధమైందనే సంకేతాలు అందినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్‌గానీ, వైట్‌హౌజ్ వర్గాలు గానీ దీనిపై ఇప్పటివరకు ఏ స్పష్టతా ఇవ్వలేదు.









Comments