ఈవీలు సరే.. మరి చార్జింగ్ ఎట్ల?
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయాలు తగ్గించాలంటే ఎలక్ట్రికల్ వాహనాల వాడకం తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో టూ, త్రీ, ఫోర్ వీలర్స్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆయా షోరూమ్స్‌కు క్యూ కడుతున్నారు. కానీ ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఎక్కడా చార్జింగ్ స్టేషన్లు కన్పించకపోవడంతో ఆలోచనలో పడ్డారు. దీంతో ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీలు ప్రకటించినా ఈవీల కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నా చార్జింగ్ గురించి ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఈవీలు కొనుగోలు చేసే వారికి రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంది.
కూకట్‌పల్లిలో ఇదీ పరిస్థితి..
మినీ ఇండియాగా పేరుగాంచిన కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎలక్ర్టికల్ వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. గత ఏడాదిగా కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్, వివేకానందనగర్ కాలనీ ఎదురుగా, ఐడీఎల్ ట్యాంక్ మార్గంలో ఏర్పాటు చేసిన స్టేషన్లు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. నామ్‌కే వాస్తే ఏర్పాటు చేశారే తప్ప అక్కడ చార్జింగ్‌కు అవకాశం కల్పించలేదు. దీంతో అవి ఉన్నా లేనట్టే. కూకట్‌పల్లి ప్రాంతంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు కూడా అధికంగానే ఉంటాయి.
ఐటీ కారిడార్‌కు రాకపోకలు సాగించే వారు తప్ప మిగతా వారు ఈవీల ఎంక్వైరీ చేస్తున్నా కొనే సమయానికి మనసు మార్చుకుంటున్నారని కార్లను విక్రయించే ఉద్యోగులు చెబుతున్నారు. నగర ప్రయాణం అలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రహదారుల వెంట కూడా ఎక్కడో ఒకటి తప్ప ఆశించిన స్థాయిలో స్టేషన్లు లేకపోవడంతో కాస్త నిరుత్సాహపడుతున్నారని చెప్పారు. ఈవీ వాహనాల ధర ఎక్కువ.. అందుకు తగ్గ విధంగా అన్నీ ప్రాంతాల్లో చార్జింగ్ సౌకర్యం లేకపోవడంతో మళ్లీ పెట్రోల్ వాహనాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు అన్ని కార్లపై ఇవ్వకపోవడంతో వాళ్లు ఇచ్చిన మోడల్ వాహనం తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు.
ఒక్కో వాహనంపై రూ.50-1.75లక్షల వరకు రాయితీలు ఇస్తున్నా టాప్ వేరియంట్లకు వర్తించదని చెబుతున్నారు. ఎక్కువ చార్జింగ్ ఉన్న వాహనాలకు సర్వీస్ సెంటర్ల కొరత. తక్కువ చార్జింగ్ ఇచ్చే వాహనాలకు సర్వీసింగ్ సెంటర్లు ఉన్నా.. చార్జింగ్ స్టేషన్ల లేమితో ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు అద్దెకు ఉండేవారు ఆయా అపార్ట్‌మెంట్స్‌లో చార్జింగ్ పాయింట్లు పెట్టించుకోవాలంటే ఇబ్బందిగానే మారింది. చాలా మందికి ఇప్పటికీ ఈవీలు పేలిపోతున్నాయనే భయాందోళనల నుంచి బయటకు రావడం లేదు. ఎక్కడైనా అపార్ట్‌మెంట్‌లోకి ఈవీ టూ వీలర్ వచ్చిందంటే చార్జింగ్ ఎలా? డిటాచబుల్ బ్యాటరీ లిఫ్ట్‌లలో తీసుకురావద్దని కూడా హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఉన్న వాహనాలను అమ్ముదామన్నా కొనేవారు లేరు. ఇక కారు కొంటే ఎలా? మనకు సమీపంలో మాల్స్ ? షోరూమ్స్ చూసుకున్న తర్వాతనే ముందడుగు వేస్తున్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రభుత్వం ఎలక్ర్టికల్ వాహనాల కొనుగోలు వల్ల ప్రయోజనాలు, ప్రోత్సాహకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.
నిర్వహణ భారం అయితే ఎలా ?
సొంత ఇల్లు లేకపోయినా చాలా మంది కార్లు ఉండాల్సిందే అంటున్నారు. ఒకప్పుడు లగ్జరీ అయితే ఇప్పుడు అవసరం. ఎక్కువగా నగరంలో ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం కారు వినియోగం తప్పనిసరైంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచించే వారు ఎలక్ర్టికల్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పాత అపార్ట్‌మెంట్స్‌లో ఈవీ చార్జింగ్ సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేటుపైనే ఆధారపడాల్సి వస్తోంది. షోరూమ్స్, షాపింగ్ మాల్స్ తప్పా ఇంకెక్కడా కన్పించడం లేదని వాహనదారులు చెబుతున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో చార్జింగ్ యూనిట్‌కు రూ.18-24 వసూళ్లు చేస్తున్నారు. అదే ఇంట్లో అయితే రూ.8-10 ఖర్చు. అద్దెకు ఉండేవారు బయటి చార్జింగ్‌పైనే ఆధారపడాల్సి రావడంతో ఆర్థిక భారం పెరుగుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని స్టేషన్లు అందుబాటులోకి తెస్తే అదీ యూనిట్‌కు 12-15లోపే ఉంటే ఈవీ కొనుగోలు దారుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చని ఆటోమొబైల్ ఉద్యోగులు చెబుతున్నారు.









Comments