• Jun 05, 2026
  • NPN Log

    ఉదయాన్నే మనం తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాలు శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీర్ణక్రియ, శక్తి స్థాయిలు, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అంశాలన్నీ ఇందులో ముడిపడి ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయన్నే ఏమి తినాలి? ఏమి తినకూడదు? అనే విషయంలో పలు జాగ్రత్తలు అవసరం.

    ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు..

    1. నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతి(సిట్రస్) పండ్లు ఎక్కువగా ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఎసిడిటీని ప్రేరేపిస్తాయని నిపుణులు అంటున్నారు. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు.

    2. గ్రీన్ టీ: బరువు తగ్గేందుకు, యాంటీఆక్సిడెంట్ల కోసం గ్రీన్ టీ ఓ ఉత్తమ పానీయమని చాలా మంది భావిస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం.. ఉదయాన్నే ఏమీ తినకుండా గ్రీన్ టీ తాగడం వల్ల ఎసిడిటీ, వికారం, కడుపులో అసౌకర్యం వంటివి కలగవచ్చు. గ్రీన్ టీలో కెఫీన్, టానిన్లు ఉండటమే దీనికి కారణం. ఇవి కొన్నిసార్లు ఉదరంలో చికాకునూ కలిగించే అవకాశముంది.

    3. టీ, కాఫీ: చాలా మందికి టీ లేదా కాఫీ లేకుండా రోజు ప్రారంభం కాదు. అయితే.. ఖాళీ కడుపుతో ఈ రెండింటినీ తీసుకోకూడదు. అవి జీర్ణవ్యవస్థలో ఎసిడిటీ, ఉబ్బరం, చికాకుకు కారణమవుతాయని పేర్కొన్నారు.

    4. మసాలా ఫుడ్స్: పచ్చిమిర్చి, ఎండుమిర్చి లేదా మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను పరగడుపున తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఈ రకమైన ఫుడ్స్ వల్ల కడుపులో మంట, జీర్ణాశయంలో అసౌకర్యం వంటివి కలుగుతాయని హెచ్చరిస్తున్నారు.

    5. పండ్ల రసాలు: పండ్ల రసాలు తరచూ ఆరోగ్యకరమైన ఎంపికగా కనిపిస్తుంటాయి. కానీ అవి ఎల్లవేళలా అంతమంచివి కావు. పండ్లతో పోలిస్తే జ్యూస్‌లలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఉదయాన్నే వాటిని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు మరింత వేగంగా పెరిగే అవకాశముంది.

    మరి ఏమి తినవచ్చు?

    1. గోరువెచ్చని జీలకర్ర నీరు: జీలకర్రను నానబెట్టి లేదా మరిగించి తయారుచేసిన గోరువెచ్చని నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడం, పేగులను శుభ్రం చేయడంలోనూ ఉపయోగపడుతుంది.

    2. తాజా పండ్లు, విత్తనాలు: తాజా పండ్లను గుమ్మడి, అవిసె వంటి వివిధ రకాల గింజలతో కలిపి తీసుకోవడం వల్ల పీచుపదార్థం, ఆరోగ్యకర కొవ్వులు శరీరానికి సమతుల్యంగా లభిస్తాయి. వీటితో పాటు తగినంత ఎనర్జీ కూడా అందుతుంది.

    3. తాజా కూరగాయల రసాలు: దోసకాయ, సొరకాయ, బీట్‌రూట్, క్యారెట్, కొత్తిమీర వంటి కూరగాయలతో తయారుచేసిన రసాలు శరీరానికి తగినంత నీటితో పాటు యాంటీఆక్సిడెంట్లనూ అందిస్తాయి.

    4. నానబెట్టిన డ్రైఫ్రూట్స్: నానబెట్టిన బాదం, వాల్‌నట్ వంటి డ్రైఫ్రూట్స్ సులభంగా జీర్ణమవుతాయి. ఇవి ఆరోగ్యకర కొవ్వులు, ఖనిజాలు, ప్రోటీన్లను అందించడం సహా రోజంతా చురుకుగా ఉండేలా దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి.

    5. అధిక ప్రోటీన్‌తో కూడిన అల్పాహారం: మొలకలు, పెరుగు, పెసరట్టు, శనగలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం సహా ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో అనవసరమైన చిరుతిండ్లపై ఆసక్తి తగ్గుతుంది.

    ఏది ఏమైనా ఉదయం తీసుకునే ఆహారం రోజంతా శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఖాళీ కడుపుతో అధిక ఆమ్లత్వం కలిగించే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పీచుపదార్థం, ప్రోటీన్, సహజ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా రోజంతా ఆరోగ్యకరంగా గడపవచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement