• Jun 05, 2026
  • NPN Log

    కొన్ని సినిమాలు కాసుల వర్షాలు కురిపించక పోయినా కళాత్మకంగా కనికట్టు చేశాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్  తెరకెక్కించిన 'సిరివెన్నెల' ఆ కోవకు చెందినదే. జూన్ 5తో 'సిరివెన్నెల'   నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ విశేషాలను గుర్తు చేసుకుందాం.
    కళాప్రియులను ఆకట్టుకున్న చిత్రం...

    'సిరివెన్నెల' సినిమాను తలచుకోగానే గీత రచయిత సీతారామశాస్త్రి చప్పున గుర్తుకు వస్తారు... ఆయనకు పాటల రచయితగా ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టడంతో 'సిరివెన్నెల' ఇంటిపేరుగా మారింది. 'శంకరాభరణం' తరువాత కె.విశ్వనాథ్ పేరు ముందు 'కళాతపస్వి' చేరిపోయింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. అలాంటి సమయంలో 1986 జూన్ 5వ తేదీన 'సిరివెన్నెల' చిత్రం జనం ముందు నిలచింది... విశ్వనాథ్ చిత్రాలను అభిమానించేవారికి 'సిరివెన్నెల' నచ్చింది. అయితే సగటు ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడంలో 'సిరివెన్నెల' అంతగా మురిపించలేక పోయింది. తరువాతి రోజుల్లో 'సిరివెన్నెల' సినిమా పాటలు విశేషాదరణ పొందడం- అందులోని భావాలను సాహితీ ప్రియులు విశేషంగా ప్రస్తుతించడం జరిగింది. అలా 'సిరివెన్నెల' కళాప్రియులను ఆకట్టుకుంది.

    కారణం అదేనా...!?
    'సిరివెన్నెల' సినిమా కథలో ఎంతో వైవిధ్యం దాగుంది. కథానాయకుడు గుడ్డివాడు. కథానాయిక మూగ. వీరిద్దరితో పాటు హీరోలో అనురాగం నింపిన మరో మహిళ మధ్య  కథ సాగుతుంది. దీనిని మనసులు ఆకట్టుకొనేలా విశ్వనాథ్ తెరకెక్కించారు. అయితే 'సిరివెన్నెల' రిలీజైన రోజునే అప్పటి టాప్ స్టార్స్ చిత్రాలు పోటీగా విడుదలయ్యాయి. శోభన్ బాబు, జయసుధ జంటగా రూపొందిన 'జీవనరాగం', కృష్ణ, శ్రీదేవి జోడీగా తెరకెక్కిన 'ఖైదీ రుద్రయ్య' చిత్రాలు రావడంతో 'సిరివెన్నెల' వైపు అంతగా జనం సాగలేదు. ఆ రెండు సినిమాలు పరవాలేదనిపించు కున్నాయి. 'సిరివెన్నెల'లోని పాటలు కేవీ మహదేవన్ స్వరకల్పనలో సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

     
    తరువాతి రోజుల్లో...
    'సిరివెన్నెల' చిత్రంలో హీరోగా బెంగాలీ నటుడు సర్వధమన్ బెనర్జీ నటించారు. ఆయనను ఆరాధించే అభిమానిగా సుహాసిని, హీరోకు అనురాగం రుచి చూపిన పాత్రలో బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ కనిపించారు. ఈ మూడు పాత్రలే ప్రధానమైనా, ఇందులో శుభలేఖ సుధాకర్, సాక్షి రంగారావు, సంయుక్త, శుభ, వరలక్ష్మి కీలక పాత్రల్లో కనిపించారు... తరువాతి రోజుల్లో హీరోయిన్ గా అలరించిన మీనా ఇందులో బాలనటిగా అలరించారు. ఏది ఏమైనా అప్పట్లో అంతగా ఆకట్టుకోని 'సిరివెన్నెల' తరువాతి రోజుల్లో బుల్లితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement