ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏఐ యుగంలో ఏ ఫొటో అసలైనదో... ఏది కృతిమ మేధతో సృష్టించిందో, ఏ వీడియో రియలో.. ఏది ఫేకో గుర్తు పట్టలేని పరిస్థితి తయారైంది. దీంతో, తప్పుడు సమాచార వ్యాప్తి బాగా పెరిగింది. దీన్ని కట్టడి చేసేందుకు కమ్యూనికేషన్స్, ఐటీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలక సిఫారసులు చేసింది. ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ తప్పనిసరి చేయాలని సూచించింది. లైసెన్స్ ఉన్నవారే ఏఐ కంటెంట్ క్రియేట్ చేయాలని, లైసెన్స్ లేకుండా ఏఐ కంటెంట్ రూపొందించి తప్పుడు ప్రచారం చేసేవారిని గుర్తించి శిక్షించేందుకు కఠినమైన నిబంధనలు ఉండాలని పేర్కొంది. దీంతో పాటు, ఏఐతో రూపొందించిన ఫొటో అయినా, వీడియో అయినా, వార్తా కథనం అయినా.. దానికి ‘ఏఐతో రూపొందించారు’ అని ట్యాగ్ కచ్చితంగా జతచేయాలని సూచించింది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని స్థాయీ సంఘం ఈ మేరకు ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తన నివేదికను అందజేసింది. ఈ సిఫారసులు అమల్లోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉంటుంది.
Comments