కెనరా బ్యాంక్ లాభం రూ 4774 కోట్లు
బెంగళూరు : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను బ్యాంక్ నికర లాభం 19 శాతం వృద్ధి చెంది రూ.4,774 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,015 కోట్లుగా ఉంది. త్రైమాసిక కాలంలో మొండి బకాయిలు గణనీయంగా తగ్గటం ఎంతగానో కలిసి వచ్చిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు వెల్లడించారు. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా రూ.34,721 కోట్ల నుంచి రూ.38,598 కోట్లకు పెరిగిందన్నారు. ఈ కాలంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం కూడా రూ.29,740 కోట్ల నుంచి రూ.31,544 కోట్లకు పెరగగా నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.9,315 కోట్ల నుంచి రూ.9,141 కోట్లకు తగ్గింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 13.4 శాతం వృద్ధి చెంది రూ.15,27,922 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం అడ్వాన్సులు కూడా 13.7 శాతం పెరిగి రూ.11,51,041 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2.75-2.8 శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.
తగ్గిన మొండి బకాయిలు: సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 3.73 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గగా నికర ఎన్పీఏలు కూడా 0.98 శాతం నుంచి 0.54 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. మరోవైపు మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు రూ.2,587 కోట్ల నుంచి రూ.1,504 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. అలాగే ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) 90.89 శాతం నుంచి 93.59 శాతానికి పెరిగిందని పేర్కొంది. కాగా వ్యాపార విస్తరణకు సంబంధించి బ్యాంక్ వద్ద ప్రస్తుతం సరిపడా నిధులు ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులను సమీకరించాల్సిన అవసరం లేదని బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు తెలిపారు.
అమరావతిలో రీజినల్ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కెనరా బ్యాంక్ రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సత్యనారాయణ రాజు వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే చర్చించినట్లు ఆయన చెప్పారు. అయితే మొంథా తుపాను కారణంగా భూమి కేటాయింపు వాయిదా పడిందన్నారు. రూ.50 కోట్లతో పూర్తి హంగులతో ఈ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రీజినల్ ఆఫీ్‌సతో పాటు జోనల్ ఆఫీస్, రిటైల్, ఎంఎ్‌సఎంఈ విభాగాలకు సంబంధించి కార్యాలయాలు అనుబంధంగా ఉంటాయని రాజు తెలిపారు.
 
  
                      
                               
  









 
  
 
Comments