జెండా స్తంభాల తొలగింపు భేష్..
చెన్నై: జెండా స్తంభాల తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మద్రాసు హైకోర్టు ప్రశంసించింది. రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, ప్రైవేటు స్థలాల్లో రాజకీయ పార్టీలు, మత, కుల సంఘాలు ఏర్పాటుచేసిన జెండా స్తంభాలు తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం జనవరిలో ఉత్తర్వులు జారీచేసిన విషం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఇళందిరయన్ తిరిగి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా తాము చేపట్టిన చర్యలపై చెన్నై, తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల కలెక్టర్లు నేరుగా హాజరై నివేదికలను సమర్పించారు. జెండా స్తంభాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులిచ్చేందుకు మండల, జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటుచేశామని, దీనికి సంబంధించి జీవో కూడా ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రవీంద్రన్ వివరించారు. అంతేగాక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిర్వహించే సభలు, కార్యక్రమాలకు రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్ మీడియాలో జెండా స్తంభాలు ఏర్పాటుచేయరాదని,
మూడు రోజుల కంటే ఎక్కువగా స్తంభాలు ఉంచరాదని కూడా నిర్దేశించామని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యల్ని న్యాయమూర్తి అభినందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాటించాలని స్పష్టం చేశారు. అలాగే, ఈ మార్గదర్శకాలు అమలుచేయని అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణ అక్టోబరు 15వ తేదీకి వాయిదావేశారు.
Comments