తీరం వెంబడి ఈదురు గాలులు.. మత్స్యకారులకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్న నేపథ్యంలో రానున్న నాలుగు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమలో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈ సమయంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు.
అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ఎవరూ చెట్ల కింద నిలపడకూడదని అలర్ట్ చేశారు. శుక్రవారం నాడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని శ్రీనివాసరావు వెల్లడించారు. కోస్తాంధ్రలోనూ పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.
Comments