నాన్నా నన్ను కొట్టొద్దు.. పురుగుమందిస్తే తాగి చచ్చిపోతా..
గుంటూరు : ‘ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అతడితోనే ఉంటా’నని కుమార్తె చెప్పడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. కోపంతో రగిలిపోయాడు. ‘నాన్నా నన్ను కొట్టొద్దు.. నాకు పురుగు మందు ఇవ్వు.. తాగి చచ్చిపోతా’.. అంటూ వేడుకున్నా.. మనసు కరగలేదు. చిన్నప్పుడు తన గుండెలమీద కూర్చొని ఆడుకున్నదనే వాత్సల్యం కూడా మరచి.. కూతురి గుండెలపైనే కూర్చొని.. ఊపిరాడకుండా చేశాడు! తన మేనల్లుడు ఆమె కాళ్లు పట్టుకోగా.. ఆమె ఉదరంపై కూర్చొన్నాడు! పదడుగుల ఎత్తులో ఉన్న ఫ్యాన్‌కు కొత్త చీరతో ముడివేసి.. కొన ఊపిరితో ఉన్న కుమార్తెను వేలాడదీశాడు.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు! పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పాతూరులో ఇటీవల జరిగిన నవ వధువు కామనబోయిన చౌడేశ్వరి(22) మృతికి సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. చౌడేశ్వరి పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య కాదని తేలడంతో పోలీసులు మంగళవారం ఆమె తండ్రి చంద్రశ్రీనుతోపాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. శ్రీను కుమార్తె చౌడేశ్వరి(22), మాచర్ల మండ లం జమ్మలమడక గ్రామానికి చెందిన గంగనబోయిన నాగరాజు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురిదీ ఒకే సా మాజిక వర్గం. అయినా చంద్రశ్రీనుకు వారిద్దరి పెళ్లి ఇష్టంలేదు. ఈ నేపథ్యంలో గత నెల 4న ప్రేమికులిద్దరూ ఇల్లు విడిచి పారిపోయారు. విజయవాడలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకొని, అక్కడి నుంచి చెన్నై వెళ్లి వారం రోజులపాటు గడిపారు. తర్వాత నరసరావుపేటలో నాగరాజు అనే స్నేహితుడు ఇంటికి చేరుకున్నారు. ఈలోగా తన కూతురు కనిపించడం లేదంటూ చంద్రశ్రీను పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గత నెల 15న నరసరావుపేటలో నాగరాజు, చౌడేశ్వరిలను కనిపెట్టి.. వారిని మాచర్ల తీసుకొచ్చారు. ఇరువురూ మేజర్లు కావడంతో చేసేదేమీ లేక వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘నేను నాగరాజును పెళ్లి చేసుకున్నాను.. అతడితోనే వెళ్తా’ అని తేల్చి చెప్పింది. దీంతో ఇరువర్గాల పెద్దలు ఐదు రోజుల సమయం పెట్టుకొని అమ్మాయిని.. తండ్రి చంద్రశ్రీనుతో ఇంటికి పంపారు. అయితే గత నెల 18వ తేదీన చౌడేశ్వరి ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించింది.









Comments