• Apr 02, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ సిటీ: పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్‌ చేపట్టింది. మైలార్‌దేవ్‌పల్లి శాస్ర్తిపురంలోని 6500 చదరపు గజాల క్రీడా మైదానంలో ఆక్రమణలను బుధవారం తొలగించింది. ఈ స్థలం విలువ రూ.100 కోట్లు ఉంటుందని సంస్థ పేర్కొంది. ఈ నిర్మాణాన్ని కూల్చిన హైడ్రా.. చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది. క్రీడా మైదానం అక్రమణదారులకు పాతబస్తీలో బలంగా ఉన్న ఓ పార్టీ నాయకుడి అండదండలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఓ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరుడికి చెందిన గ్రూపు సభ్యులే క్రీడా మైదానం కబ్జా వెనుక ఉన్నారని స్థానికులు చెబుతుంటారు.

    వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లి నేషనల్‌ పోలీస్‌ అకాడమి ముందు గల రాఘవేంద్రకాలనీని ఆనుకుని ఉన్న శాస్ర్తిపురం కాలనీలో 188 ఎకరాల స్థలంలో హుడా అనుమతితో 1800లకుపైగా ప్లాట్లతో లే అవుట్‌ అభివృద్ధి చేశారు. లే అవుట్‌లోని పలు ప్రాంతాల్లో పార్కులతో పాటు 6500 చదరపు గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్‌ కోం కేటాయించారు. ప్లే గ్రౌండ్‌ చుట్టూ ప్రహరీ, గేట్లు కూడా ఏర్పాటు చేయగా, వాటిని కూల్చివేసి కబ్జాదారులు ప్లాట్లుగా విభజించి విక్రయించారు.

    అలా విక్రయించిన క్రీడా మైదానం స్థలంలో ఐదు, నాలుగు, మూడు అంతస్తులతో వేర్వేరుగా ఐదు భవనాలు నిర్మిస్తున్నారు. వాటన్నింటిని బుధవారం హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. పక్కనే ఉన్న మరో రెండు గదులూ తొలగించారు. మరో రెండు భవనాల్లో ప్రజలు నివసిస్తుండడంతో.. ఖాళీ చేసేందుకు వారికి కొంత సమయమిచ్చారు. ఖాళీ చేయగానే వాటిని కూడా కూల్చేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. ఆక్రమణలు తొలగించి స్థలం కాపాడడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

    బాలానగర్‌లో పార్కు స్థలం..

    నకిలీ బాలానగర్‌లో పార్కు కబ్జా ప్రయత్నానికి హైడ్రా చెక్‌ పెట్టింది. 968 చదరపు గజాల స్థలానికి బుధవారం హైడ్రా అధికారులు ఫెన్సింగ్‌ వేశారు. బాలానగర్‌లోని 7.12 ఎకరాల స్థలంలో 1983లో లే అవుట్‌ అభివృద్ధి చేశారు. లే అవుట్‌లో పార్కుగా చూపిన స్థలం చుట్టూ ప్రహరీ, గేటు కూడా జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. 2019లో తప్పుడు పత్రాలతో ఆ స్థలం నాదని చూపిన అబ్దుల్‌ రహ్మన్‌ అలియాస్‌ గోపాల్‌ అనే వ్యక్తి అనుమతులు తెచ్చుకొని నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కబ్జాదారుడిపై జీహెచ్‌ఎంసీ అధికారులు, సొసైటీ ప్రతినిధులు కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో పార్కు స్థలంలో కబ్జాదారులు ఉంచిన సామాగ్రీని తొలగించిన హైడ్రా.. బోర్డులు ఏర్పాటు చేసింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement