నిరాశపరిచిన నీరజ్ చోప్రా.. నాలుగో స్థానంలో నిలిచిన సచిన్ యాదవ్..
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో విభాగంలో పతకం లేకుండానే భారత్ కథ ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్టార్ అథ్లెట్, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచాడు. ఆశలు రేపిన మరో జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గురువారం టోక్యో వేదికగా జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో మొత్తం 12 మంది అథ్లెట్లు పోటీపడ్డారు.
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్క్‌ను దాటలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు విసిరి ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. గత ఒలింపిక్స్‌తో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై మెరిసిన నీరజ్ చోప్రా ఈ సారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సచిన్ యాదవ్ మాత్రం ఆశ్చర్యపరిచాడు. అంచనాలకు మించి రాణించిన సచిన్, అత్యుత్తమంగా 86.27 మీటర్ల త్రో విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు.
సచిన్ కేవలం 40 సెంటీమీటర్ల స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు. కాగా, ఈ పోటీలో స్వర్ణ పతకాన్ని ట్రినిడాడ్ అండ్ టుబాగో అథ్లెట్ కెషోర్న్ వాల్కాట్ కైవసం చేసుకున్నాడు. అతను 88.16 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలిచాడు. గ్రెనాడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.38 మీటర్లతో రజత పతకాన్ని, థాంప్సన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.
Comments