ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్
న్యూయార్క్: ప్రపంచ నం.1 ధనవంతుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. తాను స్థాపించిన రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్‌ఎక్స్ షేర్ల లిస్టింగ్‌తో ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ లక్ష కోట్ల డాలర్లు దాటేసింది. దాంతో ఆయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు. కనీసం లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వ్యక్తిని ట్రిలియనీర్ అంటారు. మిగతా సంపన్నులు ఈ ఘనతను సాధించేందుకు మరి కొన్నేళ్లు పట్టవచ్చు. ఎందుకంటే, బ్లూంబర్గ్ వరల్డ్ రిచ్ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ నెట్‌వర్త్ 30,400 కోట్ల డాలర్లు. అంటే, మస్క్ సంపదలో మూడోవంతే. అంతేకాదు, ప్రపంచ టాప్-5 కుబేరుల్లోని మిగతా నలుగురి కంటే మస్క్ సంపదే అధికం. తైవాన్, ఐర్లాండ్, స్వీడన్ దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువే.
ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓ
ఐపీఓలో భాగంగా స్పేస్‌ఎక్స్ 55.56 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ 135 డాలర్ల చొప్పున విక్రయానికి పెట్టింది. తద్వారా కంపెనీ 7,500 కోట్ల డాలర్లు (సుమారు రూ.7.13 లక్షల కోట్లు) సమీకరించింది. ప్రపంచంలో ఇదే అత్యంత విలువైన ఐపీఓ. అలాగే, ఈ ఇష్యూ ద్వారా (స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాక ముందే) సంస్థ మార్కెట్ విలువ 1.77 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువతో మార్కెట్లో లిస్టయిన తొలి కంపెనీ కూడా స్పేస్‌ఎక్స్ కావడం విశేషం. అంతేకాదు, అమెజాన్ తర్వాత ఆరో అత్యంత విలువైన కంపెనీగానూ అవతరించింది.
2 లక్షల కోట్ల డాలర్లు దాటిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ
స్పేస్‌ఎక్స్ శుక్రవారం తన షేర్లను అమెరికాలోని నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు చేసింది. ఐపీఓ ధర 135 డాలర్లతో పోలిస్తే.. 11 శాతం ప్రీమియంతో 150 డాలర్ల వద్ద లిస్టయింది. వెంటనే షేరు 160 డాలర్ల స్థాయిని కూడా దాటి.. ఒక దశలో (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) దాదాపు 30 శాతం వృద్ధితో 176.52 డాలర్ల వద్దకు ఎగబాకింది. షేరు విలువ 160 డాలర్లు దాటడంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా 2 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించేసింది. ఒక దశలో 2.30 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దాంతో స్పేస్‌ఎక్స్‌లోని మస్క్ ఈక్విటీ వాటా విలువ 82,000 కోట్ల డాలర్లు దాటేసింది. తన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా వాటా విలువ 28,000 కోట్ల డాలర్లతో కలిపి మస్క్ మొత్తం నెట్‌వర్త్ 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది.
మన కరెన్సీలో దాదాపు రూ.105 లక్షల కోట్లు. అంటే, రూ.కోటి కోట్ల పైమాటే. స్పేస్‌ఎక్స్ ఐపీఓ ద్వారా షేర్లను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా కంపెనీలోని మస్క్ వాటా విలువ 20,000 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతేకాదు, స్పేస్‌ఎక్స్ ఐపీఓతో కంపెనీకి చెందిన 4,400 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కూడా కోటీశ్వరులుగా మారారు.









Comments