• Jun 13, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ అమ్మకాలపై పరిమితి విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బల్క్‌ వినియోగదారులకు(ప్రభుత్వ రవాణా సంస్థలు, ఇన్‌ఫ్రా కంపెనీలు, ప్రైవేటు ట్రావెల్స్‌, పరిశ్రమల వంటివాటికి) విక్రయిస్తున్న డీజిల్‌ లీటరు రూ.134.50 కాగా.. బంకుల్లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.95.20గా ఉంది. ధరల్లో ఇంత తేడా ఉండడంతో చాలా మంది బల్క్‌ వినియోగదారులు నిబంధనలకు విరుద్ధంగా రిటైల్‌ ఔట్‌లెట్లకు వెళ్లి డీజిల్‌ పోయించుకుంటున్నారు. దీనివల్ల సాధారణ వినియోగదారులకు కొరత ఏర్పడడమే కాక.. చమురు సంస్థలకు నష్టాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సర్కారు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బంకుల్లో ఒక వాహనానికి/ఒక వినియోగదారుకు.. ఒక రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్‌ మాత్రమే విక్రయిస్తారు. బంకుల్లో.. ఆ ఇంధనాన్ని కూడా నేరుగా వాహనంలో పోస్తారు. లేదా పెసో (పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌) ఆమోదం పొందిన కంటెయినర్లలో పోస్తారు. అంతే తప్ప మామూలు ప్లాస్టిక్‌ కంటెయినర్లలో డీజిల్‌ నింపరు. అలా పోయించుకున్న డీజిల్‌ను వేరొకరికి విక్రయించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే.. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత అవసరాల కోసం పెద్ద ఎత్తున డీజిల్‌ కొనుగోలు చేసేవారు పెట్రోల్‌ లేదా డీజిల్‌ను సాధారణ ప్రజల తరహాలో నేరుగా రిటైల్‌ ఔట్‌లెట్లకు(బంకులకు) వెళ్లి పోయించుకోవడానికి అనుమతించరు. ఆ తరహా బల్క్‌ వినియోగదారులు కచ్చితంగా తమ సొంత (తమ పరిశ్రమ/సంస్థ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న) బంకుల ద్వారా మాత్రమే తమకు కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నియంత్రణలన్నీ 90 రోజులపాటు అమల్లో ఉంటాయి. మళ్లీ పొడిగించే అవకాశం ఉంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement