• Jun 13, 2026
  • NPN Log

    ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం ప్రజలకు మరింత మెరుగ్గా అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏఐ సేవలను వినియోగించుకోవడానికి సిద్ధమవుతోంది. దీనికోసం 18 స్టార్టప్‌ సంస్థలను ఎంపికచేసి 18 చోట్ల వివిధ రకాల సేవలను పరీక్షిస్తోంది. ఈ స్టార్టప్‌ సంస్థలు అత్యాధునిక టెక్నాలజీతో సేవలు అందిస్తున్నాయి. రోగులు, వైద్యుల మధ్య జరిగే సంభాషణను రికార్డింగ్‌ చేయడంతోనే ఏవిధంగా వైద్యం చేయాలనే సమ్మరీ సిద్ధం అయిపోతోంది. అలాగే, దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, గుండె జబ్బులు, రక్తహీనతను ముందే గుర్తించడం, సర్వైకల్‌ క్యాన్సర్‌ చికిత్సలో ఏఐ కెమెరా వినియోగం, చిన్నపిల్లల్లో నరాల సంబంధ వ్యాధులు, శుక్లాలు, నీటికాసులు, సికిల్‌సెల్‌ ఎనీమియా, రక్తహీనత తదితర 15 రకాల పరీక్షలకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. 18 మంది ఇన్నోవేటర్లు ఏకకాలంలో వైద్య సేవల్లో కీలకమైన స్ర్కీనింగ్‌, కన్ఫర్మేషన్‌ పరీక్షలు చేస్తున్నారు. దీంతో వైద్యులకు తక్కువ సమయంలోనే వ్యాధుల ఖరారుపై అవగాహన వచ్చి, రోగులకు అత్యుత్తమ చికిత్స అందించేందుకు సమయం ఆదా అవుతుంది. అలాగే ఎక్కువకాలం వేచి చూసే పరిస్థితి లేకుండా రోగులకు ఊరట లభిస్తుంది. విశాఖ, అనంతపురం, గుంటూరు, కాకినాడ, విజయవాడ జీజీహెచ్‌, పార్వతీపురం, తెనాలి జిల్లా ఆసుపత్రి తదితరచోట్ల పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ స్టార్టప్‌ కంపెనీలు రకరకాల పరీక్షలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం నూతన ఆవిష్కరణలు చేసే వారినుంచి ‘ఏపీ మెడ్క్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌’ పేరుతో ఆరోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. వీటి పరిశీలన, సిపార్సు కోసం ప్రత్యేకంగా ‘క్యాథ్‌’ (కమిటీ ఫర్‌ అప్లయిడ్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ హెల్త్‌) కమిటీని ఏర్పాటు చేసింది.

    ఇందులో వైద్య, టెక్నాలజీ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు కలిగిన డాక్టర్‌ వి.రామనాథన్‌ (ఐఐఎస్‌, బెంగళూరు), డాక్టర్‌ మోనా దుగ్గల్‌ (ఐసీఎంఆర్‌-డైరెక్టర్‌), డాక్టర్‌ సుహేల కపూర్‌ (ఏఐ నిపుణులు-ఐసీఎంఆర్‌), డాక్టర్‌ శివకుమార్‌ (ఫౌండర్‌ స్వస్తి- ఎన్జీఓ), డాక్టర్‌ రాకేష్‌ కలపాల (ఏఐజీ హాస్పిటల్స్‌-హైదరాబాద్‌), సంగీత్‌కుమార్‌ (మెడ్క్‌ నిపుణులు), సర్వేష్‌ సింగ్‌ (మేనేజింగ్‌ డైరెక్టర్‌- మరీచి వెంచర్స్‌) సభ్యులుగా ఉన్నారు. ‘ఏపీ మెడ్క్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌కు వచ్చిన 297 దరఖాస్తులను క్యాథ్‌ కమిటీ వడబోసి 18 దరఖాస్తులను సిఫార్సు చేసింది. ఈ సంస్థలు పలు రకాల సేవలు అందిస్తున్నాయి.

    డయాగ్నోస్టిక్‌ టూల్స్‌ కేటగిరి

    శాలిసిట్‌ టెక్నాలజీస్‌, సన్ఫాక్స్‌ టెక్నాలజీస్‌, ఆర్ట్‌ పార్క్‌, కాగ్నిటివ్‌ బోటిక్‌ టెక్నాలజీస్‌ సంస్థలు చాగల్లు పీహెచ్‌సీ (పశ్చిమగోదావరి), రాజానగరం ఉపఆరోగ్య కేంద్రం (తూర్పుగోదావరి), అనంతపురం జీజీహెచ్‌, విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో పరీక్షలు చేస్తున్నాయి. దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, గుండె జబ్బులను తొలిదశలో గుర్తించడం, చిన్న పిల్లలకు న్యూరాలజికల్‌ సమస్యలకు అనుగుణంగా చికిత్స అందించడం, పూర్వ డేటా ఆధారంగా డెంగ్యూ జ్వరాల ఔట్‌ బ్రేక్స్‌ను ముందుగానే గుర్తించడం వంటి ప్రక్రియ ఈ ఆసుపత్రుల్లో కొనసాగుతోంది.

    పోర్టబుల్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ కేటగిరి

    పెరివింకిల్‌ టెక్నాలజీస్‌, రెమిడియో ఇన్నోవేటివ్‌ సొల్యూషన్స్‌, ప్రైమరీ హెల్త్‌ టెక్‌, హువెల్‌ లైఫ్‌ సైన్సెస్‌, సిగటపుల్‌ టెక్నాలజీ సంస్థలు డయాగ్నోస్టిక్‌ సెంటర్లు లేకుండానే కేవలం సూటుకేసుల్లో ఇమిడిపోయే అత్యాధునిక పరికరాలతో రకరకాల పరీక్షలు చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. ఇక్కడే శుక్లాలు(క్యాటరాక్ట్‌), డయాబెటిక్‌ న్యూరోపతిలో టెక్నాలజీని వినియోగిస్తున్నారు. క్షయను నిర్ధారించే ఆర్టీపీసీఆర్‌ పరికరాలు, ఎనిమియా, లుకేమియాను ‘బ్లడ్‌ స్లైడ్‌’ ఆధారంగా గుర్తించే పరీక్షలు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్నాయి. విజయవాడ సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన సూటుకేసు సైజు కిట్ల ద్వారా షుగర్‌, కిడ్నీ, థైరాయిడ్‌, ఇతర రక్త పరీక్షలు చేస్తున్నారు.

    స్మార్ట్‌ మానిటరింగ్‌ అండ్‌ వేరియబుల్స్‌ కేటగిరి

    కేర్‌ ఎన్‌ఎక్స్‌ ఇన్నోవేషన్స్‌, స్టార్టూన్‌ ల్యాబ్స్‌, వెల్లిటిక్స్‌, కార్డియో మెట్‌ కేర్‌ ప్లస్‌, ఇన్యాసిల్‌ టెక్నాలజీస్‌ సంస్థలు శరీరానికి అమర్చే ఉప పరికరాల సాయంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి, తెనాలి జిల్లా ఆసుపత్రి, విశాఖలోని విక్టోరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్‌, పార్వతీపురం జిల్లా ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నారు. నవజాత శిశువులకు అత్యవసర సమయాల్లో తేలికపాటి ఆక్సిజన్‌, కీళ్లనొప్పుల మూలాలను గుర్తించడం, వైద్యులు, రోగి మధ్య జరిగే సంభాషణను రికార్డు చేసి, రోగ నిర్ధారణ, ప్రిస్కిప్షన్‌ సిద్థం చేయడం వంటి పరీక్షలు వాటిలో ఉన్నాయి.

    రిమోట్‌ కేర్‌ టెలి మెడిసిన్‌ కేటగిరి

    మోనేరి ఏఐ, రెజువెన్‌ మెడికేర్‌, వ్యూహ మెడేటా, డీప్‌ ఫ్యాక్ట్స్‌ సంస్థలు రక్త నమూనా తీసుకోకుండానే కంటి ఫొటోతో రక్తహీనత గుర్తించే పరీక్షలు చేస్తున్నారు. స్టెతస్కోపునకు అదనంగా చిన్న పరికరాన్ని అమర్చి, ఈసీజీ లేనిచోట్ల గుండె సమస్యలు గుర్తించడం, సర్వైకల్‌ క్యాన్సర్‌ను గుర్తించడం, ఐసీయూల్లో ఉండే రోగులకు పరికరాలు అమర్చి నిరంతరం బీపీ, పల్స్‌, శరీర ఉష్ణోగ్రత, ఇతర మానిటరింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. పాడేరు జీజీహెచ్‌, కర్నూలు, అనంతపురం జీజీహెచ్‌, తిరుపతి రుయాలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆసుపత్రిల్లో వైద్యులు, రోగుల మధ్య జరిగే సంభాషణను ల్యాప్‌టాప్‌ (అతి చిన్న మైకుల సాయంతో)లో నిక్షిప్తం చేస్తున్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద వైద్యసేవలు అందిస్తున్న సంస్థలు సాధించిన ఫలితాలను త్వరలో క్యాథ్‌ కమిటీ విశ్లేషిస్తుందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. సంస్థ పరీక్షల గడువు కూడా త్వరలో ముగియనుంది. వీటి ఫలితాలపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. సీఎం ఆదేశాలు అనుసరించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ‘రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌’ సహకారంతో వైద్య సేవల్లో టెక్నాలజీ వినియోగంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement