యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు
న్యూ ఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు (జూన్ 5) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం యోగి సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన 'X' వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. యూపీ ప్రగతికి సీఎం యోగి చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.'ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాష్ట్ర పురోగతి కోసం ఆయన చేస్తున్న కృషి ఎంతో చెప్పుకోదగినది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్ధిని సాధించడంపైనే ఆయన ఎల్లప్పుడూ దృష్టి పెట్టారు. ఆయన నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రధానికి సీఎం యోగి ధన్యవాదాలు
ప్రధాని మోదీ ఆత్మీయ శుభాకాంక్షలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని చూపించే మార్గదర్శకత్వం, నమ్మకం తనకు నిరంతర స్ఫూర్తిని, శక్తిని ఇచ్చే వనరులని పేర్కొన్నారు. 'గౌరవనీయ ప్రధానమంత్రి ఆత్మీయమైన, హృదయాన్ని హత్తుకునే శుభాకాంక్షలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 'వికసిత ఉత్తర్‌ప్రదేశ్' నిర్మాణ ప్రయాణంలో మీ మార్గదర్శకత్వం, విశ్వాసం, ఆత్మీయ బలం నాకు కొండంత అండ' అని యోగి ట్వీట్ చేశారు.
MP, ప్రముఖ నటి హేమమాలిని శుభాకాంక్షలు
మథుర పార్లమెంట్ సభ్యురాలు (MP), ప్రముఖ నటి హేమమాలిని కూడా సీఎం యోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మథుర నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సీఎం యోగితో మాట్లాడటం తనకు ఎప్పుడూ ఎంతో సంతోషాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు. మథుర నియోజకవర్గ అవసరాలను ఆయన చక్కగా అర్థం చేసుకుంటారని, తన దార్శనికతను పంచుకుంటూ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని కొనియాడారు. యోగి ఆదిత్యనాథ్ సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, దేశానికి మరిన్ని సంవత్సరాల పాటు సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని హేమమాలిని ఆకాంక్షించారు. ఇక, దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు, ప్రజలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.










Comments