రంగుమారిన పొలాలు.. ఆందోళనలో రైతులు
సంగారెడ్డి జిల్లా: జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని పొలాలు, చెరువు రంగు మారటం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో నల్లకుంట చెరువులో భారీగా రసాయనాలు చేరాయి. ప్రమాదకర రసాయనాలతో చెరువు, పొలాలు రంగు మారిపోయాయి. నల్లకుంట చెరువు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చుట్టు పక్కల ఉన్న వందల ఎకరాలలో పంట పొలాల్లో ఎరుపు రంగునీరు వచ్చి చేరింది. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులకు తమ పొలాలు ఎరుపు రంగుతో దర్శనమివ్వడంతో షాక్‌కు గురయ్యారు.
రసాయనాలు కలిసిన నీటి వల్ల తమ పొలాలకు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా పరిశ్రమల నుంచి రసాయనాలు వదలడమే కారణమన అన్నదాతలు ఆరోపిస్తున్నారు.
వర్షం పడిన సమయంలో పరిశ్రమల నుంచి తరచుగా రసాయనాల విడుదల అవుతాయి. అయినప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోని పరిస్థితి. గత రాత్రి భారీ వర్షం పడటంతో పరిశ్రమలు రసాయనాలు విడుదల చేయడంతో నల్లకుంట చెరువుతో పాటు తమ పొలాలు కూడా రంగు మారాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
Comments