వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు
న్యూఢిల్లీ : వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల సిలిండర్ ధరను రూ.195.50 మేర పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర పన్నులు కలుపుకొని రూ.2,320కి చేరుకుంది. ప్రీమియం, బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్ ధరలను కూడా చమురు కంపెనీలు పెంచాయి. ఢిల్లీలో ప్రీమియం పెట్రోల్(ఎక్స్పీ 100) ధరను లీటరుకు రూ.11 పెంచడంతో రూ.160కి చేరుకోగా, ఎక్స్‌ట్రాగ్రీన్ డీజిల్ ధర లీటరుకు రూ.1.50 పెరిగి రూ.92.99కి చేరింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర 114 శాతం పెరిగి కిలో లీటరుకు రూ.2.07 లక్షలకు చేరుకుంది. అయితే, ఇది అంతర్జాతీయ విమాన సర్వీసులకే వర్తిస్తుంది. దేశీయ సర్వీసులకు ఇంధనం ధర పెంపును 8.5 శాతానికే పరిమితం చేశారు. వాటికి కిలోలీటరు ఇంధనం ధర రూ.1,04,927కి పెరిగింది. ఇక సాధారణ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. సహజవాయువు దిగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో మార్చి 1వ తేదీన వాణిజ్య సిలిండర్ ధరను రూ.114 మేర పెంచారు. మార్చి 7న 14.2 కిలోల గృహవినియోగ సిలిండర్ ధరను రూ.60 మేర పెంచిన విషయం తెలిసిందే. కాగా, విమాన ఇంధనం ధర పెంపుతో దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల మీద అదనపు ఇంధన రుసుం వసూలు చేయనున్నామని, ఇది కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.10 వేల వరకు ఉంటుందని ఇండిగో సంస్థ ప్రకటించింది. విమాన టికెట్ల ధరలు ఈ మేరకు పెరగనున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇండిగో సంస్థ ప్రయాణికుల నుంచి ఇంధన రుసుం వసూలు చేస్తోంది. ప్రస్తుత పెంపు దీనికి అదనం. ఇతర విమానయాన కంపెనీలు కూడా టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఉంది.










Comments