విస్కీ తాగుతూ యువకుడు మృతి
ఏలూరు క్రైం : పట్టణంలోని ఒక బ్రాందీ షాపు పర్మిట్ రూమ్‌లో రూ.99 మద్యం తాగుతూ ఒక యువకుడు మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన ఏలూరు నగరంలో కలకలం రేపింది. యువకుడు తాగిన మద్యం బ్రాండ్ బాటిల్స్‌ను పోలీస్, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపించారు. పోలీసులు తెలిపిన మేరకు... ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన మేకా అనిల్ (30) భార్య, పిల్లలను ఒదిలి కొంతకాలంగా ఏలూరులో ఉంటూ తాపీ పనులకు వెళ్తున్నాడు. అతనికి అతిగా మద్యం తాగే అలవాటు ఉంది. విజయవిహార్ సెంటర్ సమీపంలో ఎస్ఆర్ వైన్స్ కు(షాపు నంబర్ 4) గురువారం ఉదయం 10.39 గంటలకు అనిల్ వచ్చాడు. రూ.99 రాయల్ లేన్సర్ విస్కీ తీసుకుని గ్లాసులో వాటర్ ప్యాకెట్ నీళ్లు కలుపుకుని తాగుతూ కూలబడిపోయాడు. అదే సమయంలో ఇంకో వ్యక్తి అతడి జేబులోని సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. గంట తరువాత అతను మరణించినట్లు షాపు నిర్వాహకులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. టూటౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ ఆవులయ్య మాట్లాడుతూ... ‘కల్తీ మద్యం అని అపోహపడాల్సిన అవసరం లేదు. సంబంధిత బాటిల్స్‌లో నాణ్యమైన మద్యమే ఉంది’ అని పేర్కొన్నారు.
Comments