జాబ్ అలర్ట్స్ కావాలా.. అయితే, యూపీఎస్సీ గొప్ప ఛాన్స్ ఇచ్చింది
దేశంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియమకపు సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురించి చాలా మందికి తెలుసు. అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలతో పాటు భారత ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాలలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ఆయా విభాగాలలో గ్రూప్ A, గ్రూప్ B ఉద్యోగాలు భర్తీ చేయడానికి UPSC క్రమం తప్పకుండా నియామక నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. అయితే, కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు ఉద్యోగార్థుల వరకూ చేరడం లేదని ఇప్పుడు యూపీఎస్సీ అభిప్రాయపడుతోంది.
ఇందుకోసం, ఒక కొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. దీనికి సంబంధించి UPSC చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం, UPSC తన నియామక డ్రైవ్‌లను ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, దాని అధికారిక వెబ్‌సైట్, ఇంకా దాని లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ప్రకటిస్తుంది. అయితే, 'కొన్ని పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యలో అసమానతలను మేము గమనించాము. కొన్నిసార్లు, అర్హతగల దరఖాస్తుదారులు లేకపోవడం వల్ల, ఇంటర్వ్యూ దశలో ఖాళీలు భర్తీ చేయబడవు లేదా నిష్ఫలంగా మారతాయి. దీనిని పరిష్కరించడానికి, అర్హత కలిగిన అభ్యర్థులు సమాచారం లేకపోవడం వల్ల అవకాశాలను కోల్పోకుండా చూసుకోవడానికి, సంబంధిత సంస్థలకు ఇమెయిల్ ద్వారా అవుట్‌రీచ్‌ను మేము ప్రవేశపెడుతున్నాము. ఈ జాబ్ అలర్ట్స్ కావాలనుకునే ప్రైవేట్ సంస్థలకు కూడా పంపిస్తాము.' అని డాక్టర్ అజయ్ కుమార్ చెప్పారు.
కొత్త 'అవుట్‌రీచ్' విధానం ప్రకారం తీసుకునే సరికొత్త చర్యలు:
విశ్వవిద్యాలయాలు, ప్రొఫెషనల్ అసోసియేషన్లు, గుర్తింపు పొందిన సంస్థలకు కొత్త జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇమెయిల్ అలర్ట్స్ పంపిస్తాం
ప్రైవేట్ సంస్థలు కూడా ra-upsc@gov.in కు 'సబ్‌స్క్రిప్షన్ చేసుకుంటే - UPSC రిక్రూట్‌మెంట్ అలర్ట్స్' సభ్యత్వాన్ని పొందవచ్చు.
వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు వారి స్వంత వెబ్‌సైట్‌లు, ఇంకా వారి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా UPSC జాబ్ ప్రకటనలను ప్రచారం చేయాలని కోరతాం
UPSC లింక్డ్‌ఇన్‌లో నియామక నోటీసులను పంచుకోవడం తోపాటు, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా మరింత విస్తరించాలని చూస్తున్నాం
UPSC వెబ్‌సైట్‌లో జాబ్ అలర్ట్స్ కోసం RSS ఫీడ్‌లను ప్రారంభించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
మరిన్ని వివరాలు, తాజా అప్డేట్స్ కోసం upsc.gov.in ని తరచూ సందర్శించండని యూపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.
Comments